ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతూ.. బాద్‌షాగా ఎదిగాడు షారుఖ్. తన వారసురాలిగా సుహానా ఖాన్.. తాజాగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘ది ఆర్కైస్’ అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే తన నటన వల్ల ట్రోలింగ్ ఎదుర్కుంటున్న సుహానా.. తన తండ్రికి సంబంధించిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేక ఇబ్బంది పడడంతో ఫ్యాన్స్ తనను ఈ విషయంపై కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఏ అవార్డ్ దక్కలేదు..?
‘ది ఆర్కైస్’ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఇక ఈ మూవీ ప్రమోషన్ కోసం అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి వచ్చింది టీమ్. సుహానా ఖాన్, వేదాంగ్ రైనాతో పాటు డైరెక్టర్ జోయా అఖ్తర్ కూడా ఈ షోకు గెస్ట్‌లుగా హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఈ ముగ్గురు హాట్ సీట్‌లో కూర్చున్నారు. అప్పుడే వారికి షారుఖ్ ఖాన్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. ‘‘షారుఖ్ ఖాన్‌కు ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌లో ఇంకా ఏ అవార్డ్ దక్కలేదు?’’ అనేది ప్రశ్న. దానికి నాలుగు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ‘‘పద్మశ్రీ, లెజియన్ ఆఫ్ హానర్, లెటాయిల్ డార్, వాల్పి కప్’’. అయితే తన తండ్రికి సంబంధించిన ప్రశ్న కాబట్టి సుహానా చెప్పేస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అలా జరగలేదు.
తండ్రి గురించి కూతురికే తెలియదు
అందరికంటే ముందుగా పద్మశ్రీ అంటూ సమాధానమిచ్చింది సుహానా ఖాన్. వేదాంగ్, జోయా కూడా సుహానా జవాబు కరెక్ట్ అన్నట్టుగా ఒప్పుకున్నారు. కానీ అది సరైన సమాధానం కాదు.. ఉన్న నాలుగు ఆప్షన్స్‌లో షారుఖ్‌కు ఇంకా వాల్పి కప్ రాలేదు. కానీ పద్మశ్రీ అవార్డు 2005లోనే వచ్చింది. దీంతో షారుఖ్ పద్మశ్రీ వచ్చిన విషయం తన కూతురికే తెలియదా అంటూ ప్రేక్షకులు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అమితాబ్ బచ్చన్ సైతం సుహానా జవాబు విని ఆశ్చర్యపోయాడు. ‘‘కూతురికే తెలియదు తన తండ్రికి ఏ అవార్డ్ దక్కిందో. నీ ఎదురుగా కూర్చున్నవాడు నీ తండ్రితో సమానం, అందుకే సింపుల్ ప్రశ్నలు అడుగుతాడు అని నీ తండ్రి చెప్పి పంపిచినట్టు ఉన్నాడు. నేను సింపుల్ ప్రశ్న అడిగినా కూడా నీకు అసలు సరైన సమాధానమే తెలియదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అమితాబ్. పాపం, అందరి ముందు అలా పరువు తీసుకుంది. అయితే, షారుఖ్ పద్మశ్రీ అందుకొనే సమయానికి సుహానాకు ఐదేళ్లు మాత్రమే. అవార్డుల గురించి వారి ఇంట్లో పెద్దగా చర్చ ఉండదు కాబట్టి. ఆమెకు ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చని షారుఖ్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇది చిన్న విషయం కాదు
షారుఖ్ ఖాన్ సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అని కొందరు నెటిజన్లు.. సుహానాకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ పద్మశ్రీలాంటి పురస్కారం.. తన తండ్రికి దక్కిందని మర్చిపోవడం చిన్న విషయం కాదు అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అసలు యాక్టింగ్‌లో ఏ అవగాహన లేకుండా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందంటూ ట్రోల్స్ ఎదుర్కుంటున్న సుహానాపై ఇప్పుడు మరో నెగిటివ్ మార్క్ పడింది.
Also Read: మెంటల్ టార్చర్, బ్లాక్ మెయిల్ నుంచి పేమెంట్ క్లియరెన్స్ వరకు - 'డెవిల్' లేటెస్ట్ కాంట్రవర్సీ