ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకు గొడవలకు పెట్టుకొని, అది సీరియస్ అయితే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇక ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండే సెలబ్రిటీలు కూడా దీనికి మినహాయింపు కాదని ఒక టీవీ నటుడు నిరూపించాడు. తన పక్కింటివారితో జరిగిన గొడవలో కోపంతో ఒకరి చావుకు కారణమయ్యాడు బుల్లితెర నటుడు. మరో ముగ్గురు కూడా తన వల్లే తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ సీరియస్ నటుడు ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా.. హిందీలో సీరియల్స్‌ను ఫాలో అయ్యేవారికి మాత్రం సుపరిచితుడే. అతడే భూపిందర్ సింగ్. తెలుగులో కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు భూపిందర్. టాలీవుడ్‌లో కూడా ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకున్న ఈ నటుడు.. ఇప్పుడు హంతకుడు అయ్యాడు.
చెట్ల కోసం గొడవ..
‘యే ప్యార్ న హోగా కమ్’, ‘మధుబాలా’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు భూపిందర్ సింగ్. తాజాగా ఒకరి చావుకు కారణమయ్యి.. పోలీసులను తనను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. బిజ్నోర్‌లోని తన పొలం దగ్గర ఒక కంచెను ఏర్పాటు చేసుకున్నాడు భూపిందర్. తన పొలం పక్కనే ఉన్న గుర్దీప్ సింగ్ పొలంలో నుంచి కొన్ని చెట్లను కట్ చేయాలని భూపిందర్ నిర్ణయించుకున్నాడు. దానికి గుర్దీప్ ఒప్పుకోలేదని సమాచారం. దీంతో భూపిందర్‌కు కోపం రావడంతో ముగ్గురు మనుషులను తీసుకువెళ్లి గుర్దీప్‌పై, తన కుటుంబ సభ్యలపై దాడి చేశాడు.
గన్‌తో కాల్పులు..
భూపిందర్ సింగ్‌తో పాటు తనతో పాటు వచ్చిన అనుచరులు కొన్ని లైసెన్స్ ఉన్న గన్స్‌తో, కొన్ని చట్టవిరుద్ధమైన ఆయుధాలతో గుర్దీప్ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో గుర్దీప్ 23 ఏళ్ల కొడుకు గోవింద్ మరణించాడు. మరో కుమారుడు అమ్రీక్‌కు, తన భార్య బీరో బాయ్‌కు గాయాలు అయ్యాయి. గుర్దీప్ సింగ్ మాత్రం ఈ దాడి నుంచి తప్పించుకోగలిగాడు. గాయాలపాలైనవారిని మోరదాబాద్ డిఐజీ కలిసి ఘటన గురించి విచారించారు. దీనిలో పోలిసుల వైఫల్యం కూడా ఉందని బాధిత కుటుంబం ఆరోపించింది. నవంబర్ 19న భూపిందర్ సింగ్.. తమతో గొడవకు వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. వారు అప్పుడే ఫిర్యాదును సీరియస్‌గా తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు.
హిందీతో పాటు తెలుగులో కూడా..
ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే భూపిందర్ సింగ్‌తో పాటు తన అనుచరులను అరెస్ట్ చేశారు. ఇందులో పాల్గొన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గుర్దీప్ కుటుంబం చికిత్సను అందుకుంటోంది. సీరియల్స్‌లో మాత్రమే కాకుండా భూపిందర్ సింగ్.. పలు సినిమాల్లో కూడా నటించాడు. ‘షామ్ గన్‌షామ్’, ‘విలన్’, ‘యువ్‌రాజ్’ వంటి హిందీ చిత్రాలతో పాటు ‘బద్రి’, ‘అంజి’, ‘తమ్ముడు’ వంటి తెలుగు సినిమాల్లో కూడా భూపిందర్ సింగ్ కనిపించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించన భూపిందర్.. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.
Also Read: ఆ రేప్ సీన్‌తో పోలిస్తే ఇదెంత - యానిమల్ ఇంటిమేట్ సీన్స్ పై తృప్తి దిమ్రీ షాకింగ్ కామెంట్స్?