పావలా శ్యామల. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో తన చక్కటి నటనతో అలరించింది. విలక్షణమైన హాస్య నటనతో అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఆమెను చూడగానే అందరి ముఖాలపై నవ్వులు విరబూస్తాయి. తెలుగు కళామతల్లి బిడ్డగా వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందరినీ ఆనందంలో ముంచిన పావలా శ్యామల బతుకు మాత్రం దయనీయంగా మారిపోయింది. ఓవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. అత్యంత దయనీయ జీవితం గడుపుతోంది. నిస్సహ‌య‌ స్థితిలో ఉన్న ఈ సీనియ‌ర్ న‌టి ఆప‌న్నహ‌స్తం కోసం ఎదురు చూస్తోంది. తనతో పాటు తన కూతురు కూడా అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో పావలా శ్యామల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి ఆర్థిక సాయం అందినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది.


అవార్డులు అమ్మి కిరాణా సరుకులు కొన్న శ్యామల


ఆకలి అనేది మనిషిని అన్ని రకాలుగా పిల్చి పిప్పి చేస్తుంది. అవసరాలకు డబ్బులు లేక తనకు వచ్చిన అవార్డులను సైతం అమ్ముకుంది పావలా శ్యామలా. వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక రెండు మూడు రోజుల తరబడి పస్తులుండాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది. మందులు కూడా కొనుక్కునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరూ ముందుకు వచ్చి తమను ఆదుకోకపోతే తాను, తన కూతురు ఆకలితో చనిపోయే పరిస్థితి ఎదురవుతుందని కంటతడి పెట్టింది.  ఆకలిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ధైర్యం సరిపోవడంలేదంటుంది పావలా శ్యామలా. ఆమె పరిస్థితి అందరినీ కంటతడి పెట్టేలా చేస్తోంది.


పావలా శ్యామల 1984లో ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాతో  సినీ పరిశ్రమలో ప్రవేశించించింది. ‘స్వర్ణ కమలం’, ‘కర్తవ్యం’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘బ్లేడ్ బాబ్జీ’, ‘గోలీమార్’ లాంటి  సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించింది. ఆమె చక్కటి నటనకు అనేక అవార్డులు వచ్చాయి. పలు సంస్థలు సన్మానాలు కూడా చేశాయి. అలాంటి సినీ క‌ళామ‌త‌ల్లి బిడ్డ‌కు ప్రస్తుతం తినడానికి తిండి లేక, అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతోంది.


పావలా శ్యామలకు ఆసరాగా నిలవండి!


దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునే వారి కోసం ఆమె బ్యాంకు అకౌంట్ వివరాలు అందిస్తున్నాం. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Beanch , Hyderabad , Cell: 98 49 175713 సంప్ర‌దించ‌వ‌చ్చు. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడ లోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంది. దాతలు ఆమెను కలిసి డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవచ్చు.


గమనిక: పైన పేర్కొన్న బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తదితర వివరాలను పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే సాయం చేయగలరు.


Read Also: అది శృంగారం కాదు, అత్యాచారం- ట్రోలర్స్ కు చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పిన మెహ్రీన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial