Kamal Sadanah About Divya Bharti Death: సినీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న తర్వాత కొందరు నటీనటులు అనుమానస్పద రీతిలో మృతిచెందారు. అందులో హీరోయిన్ దివ్య భారతి కూడా ఒకరు. చాలా చిన్న వయసులో స్టార్ హీరోలతో నటించి.. టాలీవుడ్, బాలీవుడ్‌ను తనవైపు తిప్పుకున్నారు దివ్య భారతి. కానీ అనూహ్యంగా 19 ఏళ్లకే ఆమె కన్నుమూశారు. ముంబాయ్‌లోని తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పడిపోయి మృతిచెందారు. కానీ ఇప్పటికీ దివ్య భారతి మృతిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఆమె మరణంపై సీనియర్ హీరో, ఒకప్పటి నటుడు కమల్ సాధన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిజం కాదేమో..
‘‘దివ్య భారతి మరణ వార్తను వినడం చాలా కష్టంగా అనిపించింది. చాలా బాధగా అనిపించింది. ఎంతో టాలెంట్ ఉన్న నటీమణుల్లో తాను కూడా ఒకరు. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించేది. దివ్యకు మాత్రమే శ్రీదేవిని ఓపెన్‌గా ఇమిటేట్ చేసే ధైర్యం ఉండేది. అలా ఓపెన్‌గా చేయొద్దు అని చెప్పినా వినేది కాదు. తనెప్పుడూ సంతోషంగా ఉండేది. అందుకే తన మరణ వార్త విన్నప్పుడు చాలా షాకింగ్‌గా అనిపించింది. నేను అప్పుడే తనతో షూటింగ్ పూర్తి చేసుకున్నాను. అలా ఎలా జరుగుతుంది? ఇదంతా నిజం కాదేమో అనుకున్నాను’’ అంటూ దివ్య భారతి మరణ వార్త విన్నప్పుడు తనకు ఎలా అనిపించిందో గుర్తుచేసుకున్నారు కమల్ సాధన.
నేను నమ్ముతున్నాను..
దివ్య భారతి మరణించే సమయానికి తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, అవన్నీ జరిగుంటే తనే తరువాతి సూపర్ స్టార్ అయ్యిండేదని కమల్ సాధన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నా నమ్మకం ఏంటంటే తను అప్పటికే కొంచెం మందు తాగింది. ఆ క్రమంలో తను జారి కింద పడిపోయి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అది కచ్చితంగా ఒక యాక్సిడెంట్ అని నేను బలంగా నమ్ముతున్నాను. తను చనిపోవడానికి కొన్నిరోజుల ముందు వరకు నేను తనతో షూట్ చేస్తున్నాను. అప్పుడు కూడా తను బాగానే కనిపించింది. తనకు ఎలాంటి సమస్యలు లేవు. తను ఎన్నో గొప్ప సినిమాలు చేసింది, మరెన్నో గొప్ప సినిమాలను సైన్ చేసింది’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కమల్.
హత్య, ఆత్మహత్య కాదు..
‘విశ్వాత్మ’, ‘షోలా ఔర్ షబ్నం’, ‘దీవానా’ వంటి చిత్రాలతో దివ్య భారతికి విపరీతమైన పాపులారిటీ లభించింది. అయితే తన మృతి సహజంగా లేదని, దాని చుట్టూ ఎన్నో రూమర్స్ వస్తుండడంతో.. అప్పట్లో దివ్య భారతి తండ్రి స్వయంగా దీనిపై స్పందించారు. హత్య, ఆత్మహత్య లాంటిది ఏమీ జరిగుండదని, కచ్చితంగా అది యాక్సిడెంటే అయ్యింటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటికే దివ్య భారతి మందు తాగి ఉందని బయటపెట్టారు. తన అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్‌లో ఉండగా.. అక్కడే బాల్కనీలోని గోడపై తన కూర్చొని ఉండగా.. పొరపాటున స్లిప్ అయ్యి పడిపోయి ఉంటుందని దివ్య భారతి తండ్రి ప్రకటించారు.
Also Read: ఇప్పుడు శ్రీవల్లి 2.0ను చూస్తారు, ‘పుష్ప 2’ మూవీపై రష్మిక క్రేజీ కామెంట్స్