సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం రూటు మార్చి 'కుబేర' అనే కొత్త జానర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి? అనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన టాలీవుడ్ లోని ఇద్దరు యంగ్ హీరోలలో ఒకరితో నెక్స్ట్ మూవీకి కమిట్ కాబోతున్నారని వార్త బయటకు వచ్చింది.


'ఆనంద్' నుంచి 'ఫిదా', 'లవ్ స్టోరీ' వరకూ... అద్భుతమైన, అందమైన ప్రేమ కథలతో ప్రేక్షకులను కట్టిపడేశారు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన సినిమాకు ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తాజాగా శేఖర్ కమ్ముల 'కుబేర' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన స్పీడ్ పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది. పెద్దగా గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే శేఖర్ కమ్ముల నెక్స్ట్ చేయబోయే మూవీ లిస్టులో ఇద్దరు యంగ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు నాగచైతన్య అయితే, మరొకరు నాని. డైరెక్టర్ శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీని అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, రామ్మోహన రావు నిర్మించబోతున్నారు. 


ఈ సినిమాలో నానిని హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నానితో ఇప్పటికే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ విషయమై సంప్రదించగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కానీ కథ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కథ సిద్ధం చేశాక, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇన్సైడ్ వర్గాల సమాచారం. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు "హిట్ : ది థర్డ్ కేస్" అనే సినిమాను చేస్తున్నారు నాని. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీని పూర్తి చేయడానికి కనీసం 8 నుంచి 10 నెలలు టైం పట్టే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి నానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే శేఖర్ కమ్ముల అంత లాంగ్ గ్యాప్ తీసుకోకుండా నాగ చైతన్యతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 


Also Readదేవి శ్రీ ప్రసాద్ మాటల్లో తప్పేముంది? - పుష్ప 2 మ్యూజిక్ ఇష్యూ మీద నిర్మాత రవిశంకర్ రియాక్షన్



ఇప్పటికే శేఖర్ కమ్ముల, నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నాగ చైతన్య ఇప్పుడు 'తండేల్' మూవీతో పాటు కార్తీక్ దండు దర్శకత్వంలో పౌరాణిక ఇతిహాసం నేపథ్యంలో సాగే సినిమా చేస్తున్నారు. అయితే నాగ చైతన్య 'లవ్ స్టోరీ' సినిమాను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్లో మరో సినిమా చేస్తానని ఇప్పటికే ప్రామిస్ చేశాడు. కాబట్టి అదే ఇప్పుడు మరోసారి 'లవ్ స్టోరీ' టీం మ్యాజిక్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. మరి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న నెక్స్ట్ మూవీలో హీరోగా నాని సెలెక్ట్ అవుతాడా? లేదంటే నాగచైతన్య చేస్తాడా ? అనేది చూడాలి. 


ఇక "కుబేర" మూవీ విషయానికి వస్తే ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా రెండు పాటల షూటింగ్ పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలలో ఓ పాటను ముంబైలో, మరో పాటను హైదరాబాదులో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 1న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.


Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?