ఒక డైరెక్టర్, ఒక హీరో లేదా ఒక హీరోయిన్.. వీరికి ఫేమ్ కావాలంటే ఎన్నో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కేవలం ఒక్క సినిమాతో కూడా వీరందరికీ ఫేమ్ లభిస్తుంది. అలా ఒకేసారి డైరెక్టర్, హీరో, హీరోయిన్‌కు గుర్తింపు సంపాదించిపెట్టిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. ఈ మూవీ తీసుకొచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ‘మహాసముద్రం’తో ఎదురుదెబ్బ తిన్న డైరెక్టర్ అజయ్ భూపతి.. ఇప్పుడు ‘మంగళవారం’తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈ మూవీ కోసం పాయల్ రాజ్‌పుత్‌తో మరోసారి చేతులు కలిపాడు అజయ్. తాజాగా ‘మంగళవారం’ నుండి రెండో పాట విడుదలయ్యింది.


పాయల్, అజ్మల్ జంటగా..
‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించగా.. 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ హీరోగా కనిపించాడు. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘మంగళవారం’ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్‌పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేశ్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్‌తో పాటు ‘గణగణ మోగాలిరా’ అనే పాట కూడా విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టకుంది. తాజాగా ‘మంగళవారం’ నుండి రెండో పాట విడుదలయ్యింది. ‘ఏమయ్యిందో ఏమిటో’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను మూవీ టీమ్ విడుదల చేశారు.


‘ఏమయ్యిందో ఏమిటో’..
‘కాంతార’, ‘విరుపాక్ష’ లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలకు సంగీతాన్ని అందించిన బి అజనీష్ లోక్‌నాథ్.. ‘మంగళవారం’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. తాజాగా విడుదలయిన ‘ఏమయ్యిందో ఏమిటో’ పాటను హర్షిక ఆలపించింది. ఈ పాటలో పల్లెటూరి ప్రేమకథ కనిపిస్తుంది. అంతే కాకుండా పాయల్ రాజ్‌పుత్ ఎప్పటిలాగానే తన గ్లామర్‌ షోతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంతే కాకుండా పాయల్‌కు, అజ్మల్‌కు మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఒక మంచి మెలోడీ మాత్రమే కాకుండా రొమాంటిక్ సాంగ్‌గా కూడా ఈ పాట.. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. 


ప్రతీ మంగళవారం ఒక హత్య..
'మంగళవారం' నుంచి విడుదలయిన తొలి పాట 'గణగణ మోగాలిరా'లో ఊరు ప్రజల్లో భయాన్ని చూపించాడు అజయ్ భూపతి. అంతే కాకుండా ఈ పాటలో కథ గురించి కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే సినిమాలో ప్రతి మంగళవారం ఒక హత్య జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడీ 'ఏమయ్యిందో ఏమిటో' పాటలో హీరోయిన్ పాయల్ జీవితంలో ప్రేమను చూపించారు. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్‌తో పాటు శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు ‘మంగళవారం’లో కీలక పాత్రల్లో కనిపించారు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతికి మాత్రమే కాదు.. పాయల్ రాజ్‌పుత్‌కు కూడా ఆ రేంజ్‌లో హిట్ లభించలేదు. దీంతో వీరిద్దరూ ఎలాగైనా ‘మంగళవారం’తో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. పాయల్‌కు తన గ్లామర్ షోనే ప్లస్ పాయింట్ కాబట్టి ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆ ఎలిమెంట్ కూడా ఉందని ‘ఏమయ్యిందో ఏమిటో’ పాటలో చూపించాడు దర్శకుడు.



Also Read: ‘లియో’ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనా! - క్లారిటీ ఇచ్చిన నిర్మాత


Join Us on Telegram: https://t.me/abpdesamofficial