Actress Melissa Barrera : సినీ సెలబ్రిటీలు చేసే మంచి పనులు కూడా ఒక్కొక్కసారి వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. పర్సనల్ లైఫ్‌లో వారికి నచ్చింది చేయడం అనేది వారి సినీ కెరీర్‌ను ఎఫెక్ట్ చేస్తుంది. తాజాగా ఒక హాలీవుడ్ నటి విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు, పాలస్తీనాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనాకు చెందిన హామస్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య జరుగుతున్న పోరు.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అయితే ఈ విషయంపై హాలీవుడ్ నటి మెలిస్సా బర్రెరా స్పందించింది. గత కొంతకాలంగా తన సోషల్ మీడియా అంతా ఈ యుద్ధానికి సంబంధించిన పోస్టులతో నిండిపోయింది. దీంతో తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఫ్రాంచైజ్ నుండి మెలిస్సాను తొలగించారు. దీంతో మెలిస్సాకు మద్దతుగా పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు.


హీరోయిన్‌ను తప్పించిన మేకర్స్..
‘స్క్రీమ్’ అనే హారర్ సినిమా హాలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్.. దీనికి ఫ్రాంచైజ్‌ను క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్‌లో 6 పార్ట్స్ పూర్తయ్యాయి. ‘స్క్రీమ్ 7’ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని హాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పాలస్తీనులకు మద్దతు తెలిపినందుకు, రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు మెలిస్సాను ‘స్క్రీమ్’ ఫ్రాంచైజ్ నుండి తొలగిస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దీనిపై మెలిస్సా ఘాటుగా స్పందించింది. ‘‘నేను ముందుగా యాంటీ సెమిటిజంను, ఇస్లామాఫోబియాను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎలాంటివారిపై అయినా ద్వేషాన్ని నేను ఖండిస్తాను’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది మెలిస్సా.


మౌనంగా ఉండడం నా వల్ల కాదు..
‘‘ఒక లాటినా అమ్మాయిగా, ఒక గర్వమైన మెక్సికన్‌గా నాకు నచ్చని విషయంపై ఏ వేదికపై అయినా గట్టిగా మాట్లాడే బాధ్యత నాకు ఉంది. అందుకే అవసరం ఉన్న వారికి సాయంగా మాట్లాడడానికి, వారి గురించి అవగాహన పెంచడానికి నా బాధ్యతను, నా హక్కును ఉపయోగించాను. కులం, మతం, ఆస్తి, అంతస్తు తేడా లేకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతీ మనిషికి సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ అనేవి దక్కాలి. కొందరి మనుషుల చేతుల్లోనే లీడర్‌షిప్ ఉండదు. ప్రభుత్వ హోదాల్లో ఉన్నవారికి విమర్శించే హక్కు లేదు. నేను పగలు, రాత్రి లేకుండా మరణాలు ఆగిపోవాలని, హింస ఉండకూడదని, మనుషులంతా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూనే ఉన్నాను. నేను మానవ హక్కుల కోసం, వారి స్వేచ్ఛ కోసం మాట్లాడడం మాత్రం ఆపను. మౌనంగా ఉండడం నా వల్ల కాదు’’ అంటూ ఇకపై కూడా ఇలాంటి విషయాలను ఖండిస్తూనే ఉంటానని మెలిస్సా.. స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.


గాజాలో హింస ఆగాలి..
మెలిస్సా చేసిన పోస్టుకు పలువురు ప్రముఖులు స్పందించారు. యూరోప్ పార్లమెంట్ మెంబర్ అయిన మిక్ వాల్లేస్.. మెలిస్సాను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఫిల్మ్ క్రిటిక్ జో రోస్ బ్రయాంట్ కూడా ‘మెలిస్సాను ఎప్పటికీ సైలెంట్ చేయలేరు. మేము కూడా సైలెంట్ అవ్వము’ అని పోస్ట్ చేశాడు. నటి గ్రేస్ వాన్ డియాన్ కూడా మెలిస్సాకు సపోర్ట్ చేస్తూ.. ‘స్క్రీమ్’ మేకర్స్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ కాసేపటికే దానిని డిలీట్ చేసేసింది. ఇజ్రాయెల్.. పాలస్తీనాలోని గాజాలో చేస్తున్న హింసను ఖండిస్తూ కూడా ఒక అధికారిక లెటర్‌ను సైన్ చేసి ప్రభుత్వానికి పంపింది. అంతే కాకుండా గాజాలో నివసిస్తున్న ప్రజలకు సపోర్ట్ చేయాలని కోరింది. ‘స్క్రీమ్’ మేకర్స్.. తమ హీరోయిన్‌ను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా నేవే క్యాంప్‌బెల్‌తో రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు వచ్చి తనను కూడా ఇలాగే తొలగించారు.


Also Read: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ - త్రిష స్పందన ఇదీ


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply