ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రుణం రుధిరం'. ఈ మూవీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జక్కన్న ఆ తర్వాత అందులో హీరోలుగా నటించిన రామ్ చరణ్, తారక్. కానీ ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో సత్యదేవ్ కూడా నటించారట. మరి ఆయన సినిమాలో ఎందుకు కనిపించలేదు? ఎందుకు ఆయన నటించిన సీన్స్ ను కట్ చేశారు? అనే విషయాలను తాజాగా స్వయంగా సత్యదేవ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి సత్యదేవ్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ వచ్చే వారం 'జీబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక సినిమాలతోనే ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్టైన్ చేసే ఈ హీరో 'గాడ్ ఫాదర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఎంత ప్రయత్నించినా ఈ హీరోకి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ మాత్రం పడట్లేదు. ప్రస్తుతం తన ఆశలన్నీ 'జీబ్రా' మూవీపైనే పెట్టుకున్నాడు ఈ హీరో. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగబోతోంది. దానికి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. దీంతో 'జీబ్రా' సినిమాపై బజ్ పెరిగింది.
తాజాగా 'జీబ్రా' సినిమా ప్రమోషన్లలో భాగంగా సత్యదేవ్ మాట్లాడుతూ తాను 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించినట్టుగా వెల్లడించారు. ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో మీరు "ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారట కదా? ఆ సీన్స్ ని ఎందుకు తీసేసారు?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా సత్యదేవ్ మాట్లాడుతూ "ఇంతవరకు ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పలేదు మీకు ఎలా తెలుసు?" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా టీం మీద ఉన్న రెస్పెక్ట్ తో తను ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం సత్యదేవ్ చాలా రోజులు షూటింగ్ లో పాల్గొన్నారట. దాదాపు 15 రోజులు షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ చివరకు అది సినిమాలో ఫిట్ కావడం లేదనే ఉద్దేశంతో ఎడిటింగ్ లో తీసేసారని చెప్పి సత్యదేవ్ షాక్ ఇచ్చారు. కానీ ఒకవేళ ఆ సినిమాలో సత్యదేవ్ ఉండి ఉంటే కచ్చితంగా ఈ టాలెంటెడ్ హీరోకి మంచి గుర్తింపు దక్కేది. 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి ఇలా చేజారిపోవడం నిజంగా బాధాకరం.
ఇక సత్యదేవ్ హిందీలో అక్షయ్ కుమార్ సినిమాలో కూడా నటించాడు. 'రామ సేతు' మూవీలో సత్యదేవ్ నటించినప్పటికీ, ఆ మూవీ పెద్దగా ఆడకపోవడంతో సత్యదేవ్ కి గుర్తింపు రాలేదు. ఇక సత్యదేవ్ చేసిన మరో సినిమా 'కృష్ణమ్మ' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ థియేటర్లలో మాత్రం ఆడలేదు. 'బ్లఫ్ మాస్టర్' మూవీ మాత్రం ఆయనకు మంచి నటుడిగా గుర్తింపును తీసుకొచ్చింది. మరి తాజాగా రిలీజ్ కాబోతున్న 'జీబ్రా' సినిమాతోనైనా సత్యదేవ్ ఆశించిన హిట్ పడుతుందేమో చూడాలి.