Sattigani Rendekaralu : అభినవ్ దండా దర్శకత్వం వహించిన 'సత్తిగాని రెండెకరాలు' వెబ్ మూవీ విడుదల తేదీని ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వీడియో ప్రకటించింది. 'పుష్ప' ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి ఈ సినిమా లో కథానాయుకుడిగా నటిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత రిలీజ్ కానున్న ఈ తెలుగు వెబ్ ఫిల్మ్ మే 26న ఆహాలో విడుదల కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. 


'మైత్రీ మూవీ మేకర్స్' ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో పెద్ద సినిమాలు సంచలన విజయాలను దక్కించుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేశాయి. అదే ఉత్సాహంతో ఇప్పుడు తొలిసారి వెబ్ చిత్రంతో ముందుకు వస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. 'సత్తిగాని రెండెకరాలు' పేరుతో రాబోతున్న ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప'లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి, మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ హీరోగా నటిస్తున్నారు. 


'సత్తిగాని రెండెకరాలు' సినిమాకు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే రిలీజైన పోస్టర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ ఫిల్మ్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం మే 26న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ సినిమా రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఆహా.. "సత్తి ముందు జెప్పిన రోజు రాలే...వాని రెండెకరాల భూమి చిక్కుల్ల పడిండే ... ఇగ అన్ని సెటిల్ ఐనయ్... మే 26 న ముహూర్తం పెట్టినం! అస్తుండు, ఆగమాగం జేయనీకి.." అనే క్యాప్షన్ ను జత చేసింది. దాంతో పాటు ఈ మూవీ మే26న ప్రీమియర్ అవుతుందని ఆహా వెల్లడించింది. 






హీరో  జగదీష్ ప్రతాప్ బండారి ఓ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు ఆయనకు రూ. 25 లక్షలు అవసరమవుతాయి. అందుకోసం తనకున్న రెండెకరాలు అమ్మేయాలని అనుకుంటాడు. ఆ విషయంలో హీరోకి ఎదురయ్యే పరిస్థితులు, అవాంతరాలు ఏంటీ.. వాటిని ఎలా అధిగమిస్తాడు అన్నదే ఈ సినిమా కథ. వెన్నెల కిశోర్, మోహనశ్రీ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ డార్క్ కామెడీ చిత్రంలో రాజ్ తిరందాసు, బిత్తిరి సత్తి, అనీషా దామ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ వెబ్ చిత్రానికి జై క్రిష్ స్వరాలు సమకూర్చారు


ఇక జగదీష్ ప్రతాప్ గురించి చెప్పాలంటే.. ఆయన సినిమాల్లోకి రాకముందు లఘుచిత్రాల్లో నటించేవారు. 'నిరుద్యోగ నటులు', 'కొత్త పోరడు' లాంటి షార్ట్ ఫిలింస్ తో జగదీశ్ కు మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2019లో ప్రియదర్శి హీరోగా చేసిన 'మల్లేశం' సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ ను జగదీష్ పోషించారు. 2020లో 'పలాస', దాని తర్వాత 2021లో వచ్చిన 'పుష్ప' సినిమాలో బన్నీ స్నేహితుడిగా కేశవ్ పాత్రలో జీవించి, పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని దక్కించుకున్నారు.