బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కు దేవాలయాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. తరచుగా ఆయా ఆలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటుంది. అభిషేకాలు నిర్వహిస్తూ, తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంది. తాజాగా మధ్య ప్రదేశ్ ఉజ్జయిన్‌లో సారా అలీఖాన్ సందడి చేసింది. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించింది. మిగతా భక్తులతో కలిసి సాధారణ భక్తురాలిగానే సారా అలీ ఖాన్ దేవుడిని పూజించింది. మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసింది. ఈ దర్శనానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోసల్ మీడియాలో షేర్ చేసింది.
ట్రోలర్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సారా
సారా అలీ ఖాన్ దేవాలయాలకు వెళ్లడాన్ని ఓ వర్గం నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా సారా ఈ ట్రోలింగ్స్ మీద స్పందించింది. తను నటించిన లేటెస్ట్ మూవీ ‘జరా హాట్కే జరా బచ్కే’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమంలో ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెప్పింది. తన వ్యక్తిగత నమ్మకాల గురించి ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. “నేను నా పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటాను. నేను ప్రజలను ఎంటర్ టైన్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నా నటన నచ్చకపోతే నేను బాధపడతాను. కానీ, నా వ్యక్తిగత విషయాలలో ఎవరి జోక్యాన్ని సహించను. నా నమ్మకాలు నావి. నేను బంగ్లా సాహిబ్ కు వెళ్తాను. మహాకాల్ ఆలయంలో అభిషేకాలు చేస్తాను. భక్తితో అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్తాను. ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు” అని ఘాటుగా స్పందించింది.
పలు ఆయాల్లో పూజలు నిర్వహించిన సారా
ఇవాళ తెల్లవారుజామున, సారా ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది. ఆమె ఈ పవిత్ర ఆలయంలో పూజలు చేసింది. మహాకాలుడికి అభిషేకాలు నిర్వహించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'జై మహాకాల్' అని రాసింది. ఉజ్జయిని మహాకాల్ ఆలయ సందర్శనకు ముందు సారా, విక్కీ కౌశల్‌తో కలిసి లక్నోను సందర్శించి శివాలయంలో ప్రార్థనలు చేసింది. అంతకు ముందు సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆశీర్వాదం కోసం అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లింది.
ఇక తన తాజా సినిమా ‘జరా హాట్కే జరా బచ్కే’ను దినేష్ విజన్ మాడాక్ స్టూడియోస్ నిర్మించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. సారా, విక్కీ తొలిసారిగా స్క్రీన్‌ను పంచుకుంటున్నారు. ‘జరా హాట్కే జరా బచ్కే’ చిత్రం జూన్ 2, 2023న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు సారా చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. హోమీ అదాజానియాతో కలిసి ‘మర్డర్ ముబారక్’, ‘ఏ వతన్ మేరే వతన్’లో కూడా నటిస్తోంది. అటు ఆదిత్య రాయ్ కపూర్‌తో అనురాగ్ బసు ‘మెట్రో ఇన్ డినో’లో కూడా నటిస్తోంది.
Read Also: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్