'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' విజయాల్లో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan)ది కీలక పాత్ర. ఆ రెండు సినిమాల్లో అసలు హీరో అతనే అని చెప్పే ప్రేక్షకులు ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సంగీత్ శోభన్ అడుగు పెట్టడానికి ముందు డిజిటల్ స్క్రీన్ (వెబ్ సిరీస్)లో అతనికి హీరోగా అవకాశం ఇచ్చారు నిహారిక కొణిదెల. ఇప్పుడు అతనితో సినిమా చేస్తున్నారు. 

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక సినిమా! ప్రముఖ యువ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజవంతమైన నిర్మాతగా తన మార్క్‌ క్రియేట్ చేశారు. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లలో ఎక్కువ మంది కొత్త వారే కావడం విశేషం.

ఇప్పుడు నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థలో రెండో సినిమాను ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అందులో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న సంగతి ఈ రోజు అనౌన్స్ చేశారు. సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. త్వరలో హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అనౌన్స్ చేయనున్నారు.

Also Readమధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్‌ కుమార్ సినిమా బావుందా? లేదా?

నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ ఇంతకు ముందు నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (వెబ్ సిరీస్)లో ఆయన హీరో. నిహారిక నిర్మించిన మరో వెబ్ సిరీస్ 'బెంచ్ లైఫ్'కు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆమెను వెండితెరకు దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు నిహారిక.

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ కథను అందించగా... మహేష్ ఉప్పల సహ రచయితగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?