Akhanda 2 Thandavam: 'అఖండ 2'లో మరొక హీరోయిన్... బాలకృష్ణకు జోడీగా సంయుక్త
Samyuktha In Akhanda 2: మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2 తాండవం'లో మరొక కథానాయికను ఎంపిక చేశారు. ఆవిడ ఎవరంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'తో భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే మరొక సినిమాను ఆయన సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. 'సింహా', 'లెజెండ్', 'అఖండ'... తనకు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. 'అఖండ' సీక్వెల్ 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thandavam) ప్రారంభించారు. ఆ సినిమాలో కథానాయిక గురించి ఈ రోజు వివరాలు వెల్లడించారు.
'అఖండ 2 తాండవం'లో హీరోయిన్ సంయుక్త
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'అఖండ 2 తాండవం'లో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఎంపిక అయినట్లు సినిమా ప్రారంభోత్సవం రోజున వెల్లడించారు. ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో హీరోయిన్ సంయుక్త (Samyuktha) నటిస్తున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో రానా దగ్గుబాటికి జంటగా సంయుక్త నటించారు. తెలుగులో ఆవిడకు తొలి సినిమా అది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', ధనుష్ 'సార్', సాయి దుర్గా తేజ 'విరూపాక్ష', కళ్యాణ్ రామ్ 'డెవిల్' వంటి హిట్ సినిమాలు చేశారు. వరుస విజయాలతో జోరు మీద ఉన్న సంయుక్తను బాలకృష్ణ సినిమాలోకి కీలక పాత్రకు ఎంపిక చేశారు దర్శకుడు బోయపాటి. సినిమాలోకి ఆమెను స్వాగతిస్తూ ఇవాళ ఒక పోస్టర్ విడుదల చేశారు.
కుంభమేళాలో 'అఖండ 2 తాండవం' చిత్రీకరణ
మహా కుంభమేళాలో 'అఖండ 2 తాండవం' రెగ్యులర్ చిత్రీకరణ చేశారు. 'అఖండ' సినిమా కథ గుర్తు ఉన్నట్లు అయితే... అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఒక అఘోర పాత్ర చేశారు. 'అఖండ 2 తాండవం'లోనూ అఘోర పాత్ర ఉంటుందని, మహా కుంభమేళాలో అఘోరాల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తీశారని తెలిసింది.
దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల
'అఖండ 2 తాండవం' చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ సంస్థ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ప్రగ్యా జైస్వాల్, మరొక నాయికగా సంయుక్త నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో 'అఖండ 2 తాండవం' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రానున్నారు.