Samay Raina Emotional Post About His Father: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య సరిహద్దు ప్రాంతాలు, దేశంలోనే ప్రధాన నగరాల్లో టెన్షన్ నెలకొంది. పాక్ దాడుల్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో జమ్మూలో విధులు నిర్వహిస్తోన్న తన తండ్రి కోసం కమెడియన్ 'సమయ్ రైనా' తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

నాన్న ఫోన్ చేశారు

తన తండ్రి గురువారం రాత్రి తనకు ఫోన్ చేశారని.. ఆర్మీలో ఉన్న వారి కుటుంబసభ్యులెవరూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా నిద్రపోలేరని సమయ్ (Samay Raina) అన్నారు. తన తండ్రి గురించి ఆందోళన చెందుతున్నానని.. ఆయన ఫోన్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. 'గురువారం రాత్రి నాకు గుడ్ నైట్ చెప్పడానికి మా నాన్న ఫోన్ చేశారు. ఆయన ప్రస్తుతం జమ్మూలో విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని.. ఆందోళన చెందకుండా నిద్ర పోవాలని చెప్పారు.

ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చే  వరకూ చాలా టెన్షన్ పడ్డాను. ఆయన మాటలు విన్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నా ఇంట్లో లైట్స్ ఆపేసి అన్నీ క్లోజ్ చేసేశాను. మాకు పొరిగింట్లో అప్పటికి ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. బహుశా వారి ఇంట్లో కూడా ఓ వ్యక్తి ఆర్మీలో విధులు నిర్వహిస్తూ ఉండొచ్చు. అందుకే టెన్షన్‌కు నిద్రపట్టడం లేదేమో అని అనుకున్నాను. మన భద్రత కోసం త్యాగాలు చేస్తోన్న సైనికులు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్.' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Also Read: మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీపై బిగ్ అప్డేట్ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా? 

మరోవైపు.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. గురువారం రాత్రి క్షిపణులు, యుద్ధ విమానాలు, ఆత్మాహుతి డ్రోన్లను భారత్‌పై పాక్ ప్రయోగించగా.. భారత్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లపైకి ఈ దాడులు జరిగాయి. ఎక్కడికక్కడ వాటిని ధ్వంసం చేస్తూ పాకిస్తాన్‌కు గట్టి బదులిచ్చింది భారత్. అటు.. జమ్మూ కశ్మీర్‌లో పలు ఇళ్లను ధ్వంసం చేసింది పాక్. వీటికి బదులుగా భారత్ సైతం దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్లను కూల్చేసింది. ఇప్పటికే జమ్మూలోని ప్రజలు బంకర్లలో తల దాచుకుంటున్నారు. 

ఆర్మీకి సెలబ్రిటీల సెల్యూట్

పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్తోన్న భారత ఆర్మీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్మీకి సెల్యూట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అలాగే.. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ తన సోదరుడు చెప్పిన మాటలను పంచుకున్నారు. 'మనం ఇండియాలో ఉన్నాం. భారతీయులం. మన రక్షణ సైన్యం, వైష్ణోమాతా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పాక్‌కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా మన భూమిని తాకనివ్వరు. భారత్ మాతాకీ జై.' అని తన సోదరుడు చెప్పినట్లు అనుపమ్ చెప్పారు.

పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తూ పోస్టులు పెట్టారు. భారత సైన్యానికి మరింత శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు సాయిదుర్గతేజ్ అన్నారు. 'దీన్ని వాళ్లు ప్రారంభించారని.. మనం ముగిస్తాం.' అంటూ మంచు విష్ణు తెలిపారు.