రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు జంటగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఆమెతో విజయవంతమైన సినిమా 'మజిలీ' తీసిన శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. 


ఐటీ ఉద్యోగిగా సమంత!
Samantha Birthday Still - Khusi Movie : సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' గుర్తుకు వస్తోంది. 


'ఏ మాయ చేసావె'లో సమంత ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో ఉద్యోగిగా కనిపించారు. అయితే, 'ఏ మాయ చేసావె' తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి పాత్ర చేయడం 'ఖుషి'లోనే అనుకుంట! అందులోనూ సినిమాలోని కొత్త స్టిల్ చూస్తే... 'ఏ మాయ చేసావె'లో నడిచినట్టే ఉంది. అందులో చీర అయితే, 'ఖుషి'లో చుడిదార్! అదీ సంగతి! ఆ మధ్య హైదరాబాద్, దుర్గం చెరువు సమీపంలోని ఐటీ కంపెనీలలో విజయ్ దేవరకొండ, సమంత మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. 


ప్రస్తుతం లండన్‌లో సమంత!
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందుతున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం ఇప్పుడు లండన్ సిటీలో ఉన్నారు సమంత. అందులో వరుణ్ ధావన్ జోడీగా ఆమె నటిస్తున్నారు. బర్త్ డే రోజు కూడా లీవ్ తీసుకోలేదట.   


Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?



సెప్టెంబర్ 1న 'ఖుషి' విడుదల
Kushi Release Date : సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. 


'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో విజయ్ దేవరకొండకు నార్త్ ఇండియన్ ఆడియన్స్‌లో గుర్తింపు లభించింది. 'డియర్ కామ్రేడ్'ను దక్షిణాది భాషల్లో విడుదల చేశారు. 'లైగర్' అయితే పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సమంత పరిచయం అయ్యారు. అందులో నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. 'యశోద' పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. వీళ్ళిద్దరూ నటిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ నెలకొంది.


Also Read 'వ్యవస్థ' రివ్యూ : దీన్ని కోర్టు రూమ్ డ్రామా అంటారా? ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?     


ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.