క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. కాళిదాసు రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం' నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. మహాభారత ఇతిహాసగాథ ఆదిపర్వంలోని శకుంతల - దుష్యంతుడి ఆహ్లాదకర ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ ప్లే చేసింది. చాలా కాలంగా సెట్స్ మీదనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 

"శాకుంతలం" సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభించింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రెయిలర్ ను లాంచ్ చేశారు. ఆ మధ్య వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ గుణశేఖర్ మార్క్ ను చూపించగా.. ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

 

''లేడి కన్నులు.. నెమలి నడక.. సివంగి నడుము.." అనే వాయిస్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. శకుంతల, దుశ్యంతుడి మధ్య అందమైన ప్రేమ కథను మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో సమంత శకుంతలగా గార్జియస్ గా కనిపించింది. ఆమె భర్త దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ మెప్పించాడు. 

 

ఇందులో విశ్వామిత్రుడి పాత్రలో సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించాడు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, కబీర్ బేడి, సచిన్ ఖేడేకర్, జిషు షేన్ గుప్తా, శివ కృష్ణ, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెరంగేట్రం చేస్తోంది.

 

అయితే రిలీజ్ ట్రైలర్ లో సమంత - దేవ్ మోహన్ మినహా మిగిలిన పాత్రలకు ప్రాధాన్యత కల్పించలేదు. ప్రతి ఫ్రేమ్ ను అత్యద్భుతంగా తెరకెక్కించడానికి కృషి చేసే గుణ శేఖర్.. మరోసారి ‘శాకుంతలం’ చిత్రంతో విజువల్ ట్రీట్ ను అందించడానికి ప్రయత్నం చేశారు. విజువల్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చారు. ఏనుగులు, పులులు, నెమళ్ళు వంటి వన్య ప్రాణులను సీజీలో బాగా చూపించారు. కొన్ని షాట్స్ గుణశేఖర్ గత చిత్రాలను గుర్తు చేసినప్పటికీ, అవుట్ పుట్ వాటి కంటే బెటర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

 

‘శాకుంతలం’ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటుగా భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని ట్రెయిలర్ లో చూపించారు. 'నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. నీ కర్మను పంచుకోలేం' 'పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను, నీ ప్రేమ కూడా దూరమైతే..' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ బ్యాగ్రాండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.
  

 


 


 

శాకుంతలం చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. డీఆర్‌పీ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 3డీ వెర్షన్ లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 'రుద్రమదేవి' తర్వాత దాదాపు 8 ఏళ్లకు గుణశేఖర్ నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.