ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ, వెండి తెరపై అడుగు పెట్టబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా ‘శాకుంతలం’లో భరతుడి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంతో అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం కాబోతోంది. శకుంతల, దుష్యంతు మహారాజు ప్రేమ కథను ఈ చిత్రంలో గుణ శేఖర్ అద్భుతంగా తరకెక్కిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నాడు.  గుణ టీం వర్క్ బ్యానర్ పై ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు గుణశేఖర్.


ఏప్రిల్ 14న 5 భాషల్లో విడుదల


వాస్తవానికి ‘శాకుంతలం’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. సినిమాని 3D ఫార్మాట్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు మంచి అనుభూతి వస్తుందని భావించిన గుణశేఖర్, 3D పనుల కోసం సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఏప్రిల్ 14న ఈ సినిమా ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.


పెద్ద డైలాగ్స్, వందల మంది ముందు భయం లేకుండా చెప్పింది- సమంత


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. హీరోయిన్ సమంత తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అర్హతో సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడిన అనుబంధం గురించి వివరించింది. అర్హను చూసిన తొలిరోజు తనకు ఎంతో ముచ్చటేసిందని చెప్పింది. “అల్లు అర్హ సెట్స్ లో తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో క్యూట్ గా ఉంటుంది. తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. ఆమెకు ఇంగ్లీష్ రాదు. హాయ్ కూడా తెలుగులోనే చెబుతుంది. ఈ సినిమాలో అర్హకు పెద్ద పెద్ద డైలాగ్ లు ఉన్నాయి. అవి కూడా వందల మంది ముందు చెప్పాలి. కానీ, అర్హ ఏమాత్రం భయపడకుండా చెప్పింది” అని సమంతా వివరించింది. వెంటనే సుమ కలుగజేసుకుని ఎవరి కూతురు అక్కడ? తగ్గేదే లే! అన్నది. దీంతో సమంత “అవును తగ్గేదే లే. ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది. కానీ, అర్హకి తెలుగు చాలా చక్కగా నేర్పించారు. ఆమె పేరెంట్స్ అల్లు అర్జున్, స్నేహకు హ్యాట్సాప్ చెప్పాలి” అని సమంత ప్రశంసలు కురిపించింది.


కోలుకుంటున్న సమంత


గత ఏడాది సమంత అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్నా, ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అందుకే, చాలా వరకు తక్కువగా ప్రమోషన కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. అయితే, గతంతో పోల్చితే ప్రస్తుతం కాస్త యాక్టివ్ గానే ఉన్నట్లు చెప్పింది. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.






Read Also: హ్యాపీ బర్త్ డే అమ్ములు - భార్యకు క్యూట్‌గా విషెష్ చెప్పిన ఎన్టీఆర్!