Samajavaragamana Box Office Collections: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన 'సామజవరగమన' ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. కేవలం మౌత్ టాక్ తోనే మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ కామెడీ చిత్రంలో నరేష్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. అయితే బాక్సాఫీస్ వద్ద రెండు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతుండడం చెప్పుకోదగిన విషయం. తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే 11 వ రోజు ఈ చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించడం గమనార్హం. 'సామజవరగమన' విడుదలైన తొలి రోజు రూ. 80 లక్షలు వసూలు చేయగా, తాజాగా పదకొండో రోజు రూ. 93 లక్షలు రాబట్టి సెన్సేషన్ గా మారింది. కాగా ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది.


మామూలు బజ్ తో రిలీజైన 'సామజవరగమన' జూన్ 29న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన రోజు నుంచి ఈ సినిమాకు విమర్శకులు నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీల వరకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం మూవీకి ప్లస్ పాయింట్ గా మారింది. అందుకే ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా సాగుతోంది. అంతే కాకుండా హీరో శ్రీవిష్ణు తన కెరీర్‌లో క్లీన్ కామెడీ సినిమాతో మరో డీసెంట్ హిట్ సాధించాడు. 


స్టోరీ ఏంటంటే..


ఉమా మహేశ్వర్ రావు (వీకే నరేష్) 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఉమా మహేశ్వర్ రావు కొడుకు బాక్సాఫీస్ బాలు అలియాస్ బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీ‌ప్లెక్స్ థియేటర్‌లో టికెట్లు అమ్మే ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వర్ రావు‌ను ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని ప్రయత్నిస్తుంటాడు. తనను ఇష్టపడే ప్రతీ అమ్మాయితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయు (రెబా మోనిక జాన్) చూసి ప్రేమలో పడుతాడు. బాలు, సరయు ప్రేమకు ఉమా మహేశ్వర్ రావు కుటుంబం ఆమోదం తెలుపుతుంది. కానీ వారి పెళ్లికి ఓ సమస్య వచ్చి పడుతుంది. ఉమా మహేశ్వర్ రావు 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి ఎందుకు కష్టపడుతున్నాడు? తండ్రిని డిగ్రీ పాస్ చేయించడానికి బాలు చేసే ప్రయత్నం వెనుక కథ ఏమిటి? అమ్మాయిలందరితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయును ఇష్టపడటానికి కారణం ఏమిటి? బాలు, సరయు ప్రేమ కథలో చోటు చేసుకొన్న సమస్య ఏమిటి? కొడుకు పెళ్లి చేయడానికి ఉమా మహేశ్వర్ రావు చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి? బాలు ప్రేమ కథకు రాధాకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్), కులశేఖర్ (వెన్నెల కిషోర్)కు సంబంధమేమిటి? చివరకు ఉమా మహేశ్వర్ రావు డిగ్రీ పాస్ అయ్యాడా? బాలు, సరయు పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సామజవరగమన సినిమా. 


ఇదిలా ఉండగా ఈ చిత్రంలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి.


Read Also : Kollywood Music Directors: తెలుగు వద్దు, తమిళం ముద్దు - టాలీవుడ్‌లో కోలీవుడ్ సంగీత దర్శకుల హవా, ఈ మూవీలకు తంబీలదే మ్యూజిక్కు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial