బాలీవుడ్ నటి హేమ శర్మ తాజాగా సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ పై పలు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే 'దబాంగ్ 3' సెట్స్ లో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీతో తనకు జరిగిన సంఘటన గురించి వెల్లడించింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను దబాంగ్ 3 సినిమాలో వర్క్ చేయాలని అనుకున్నాను. సల్మాన్ ఖాన్ ని కలవాలనుకున్నాను. ఇక సినిమాలో వర్క్ చేయడం కోసం నాకున్న సామర్థ్యంతో ప్రతిదీ చేశాను. అంతకుముందు సల్మాన్‌తో నాకు ఓ సీన్ షూటింగ్ ఉంది. దాంతో నేను ఎంతో సంతోషించాను. కానీ కట్ చేస్తే సినిమాలో సల్మాన్ ఖాన్ లేకుండానే ఆ సీన్ షూట్ చేశారు’’ అని తెలిపింది.
"సల్మాన్ ఖాన్ లేకుండా సీన్ చిత్రీకరించడంతో చాలా నిరాశకు గురయ్యాను. షూటింగ్ పూర్తయిన తర్వాత నేను సల్మాన్ ఖాన్‌ను కలవాలి అనుకున్నాను. సల్యాన్ను కలవడం కోసం చాలామందితో మాట్లాడాను. సల్మాన్‌ను కలిసి ఆయనతో ఫోటో దిగడానికి సుమారు 50 మందిని సంప్రదించాను. కానీ కుదరలేదు. ఆ తర్వాత పండిట్ జనార్దన్‌ను సంప్రదించాను. ఆయన బిగ్ బాస్ కి వచ్చినప్పుడు నేను సల్మాన్‌ను ఎలాగైనా కలవాలని నా కోరికను తెలియజేశాను. ఆ తర్వాత పండిట్ జనార్ధన్.. నీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందని నాకు హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే సల్మాన్‌ను కలిసే అవకాశం వచ్చింది. దాంతో సల్మాన్‌ను కలవడానికి వెళ్ళాం. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ నాతో ఎంత దారుణంగా ప్రవర్తించారో, ఎంత అవమానించారో మాటల్లో చెప్పలేను. సల్మాన్ ఖాన్ తో ఓ ఫోటో దిగాలనుకున్నందుకు నన్ను ఓ కుక్కలా బయటికి విసిరేసారు. నాతో పాటు పండిట్ జనార్దన్ పై కూడా సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ చాలా దారుణంగా ప్రవర్తించడమే కాకుండా అతన్ని బెదిరించారు’’ అని హేమా శర్మ పేర్కొంది.
"నాకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అక్కడ 100 మందికి పైగా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్లందరి ముందు అవమానానికి గురవ్వడం వల్ల పది రోజులు నిద్ర పట్టలేదు. అసలు నేను కోరుకున్నదల్లా సల్మాన్ ఖాన్ ని కలవడం. ఆయనతో ఒక ఫోటో దిగడం. దీనికోసం నాకు ఎంతో పెద్ద అవమానం జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సల్మాన్ ఖాన్ లేరు. కానీ ఆయన ఆ సమీపంలోనే ఉన్నారు. అతను జోక్యం చేసుకొని సిచువేషన్ ని హ్యాండిల్ చేయవచ్చు. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదంటూ" అని తెలిపింది.
సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ సిబ్బందిపై ఇలాంటి విమర్శలు రావడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా సల్మాన్ సెక్యూరిటీ చాలామంది పట్ల దారుణంగా ప్రవర్తించారు. రీసెంట్ గా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని సైతం సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్స్ పక్కకి తోసేశారు. IIFA2023 ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈవెంట్లో విక్కీ కౌశల్ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా ఆ సమయంలో సల్మాన్ ఖాన్ అక్కడికి వచ్చాడు. సల్మాన్ ఖాన్ రాగానే అతని దగ్గరికి వెళ్లడానికి విక్కీ కౌశల్ ప్రయత్నించాడు. దాంతో అతని వెనకాలే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కీ కౌశల్ ని వెనక్కి తోసేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఇక ఈ వీడియోని చూసిన కొందరు సల్మాన్ ఖాన్ పై మరియు అతని సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ నిర్ణయం, ఇక సినిమాలకు వీడ్కోలు?