పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ నెల 28న ‘సలార్’ విడుదల కావాల్సి ఉంది. అయితే, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


‘సలార్’లో స్పెషల్ సాంగ్


తాజాగా ఈ సినిమాకు సంబంధించి  ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే చిత్రబృందం ఈ విషయంలో పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం సీనియర్ హీరోయిన్లు ఐశ్వర్యరాయ్ తో పాటు త్రిషను సంప్రదిస్తున్నారట. వీరిలో ఒకరిని ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్పెషల్ సాంగ్ కు వీరిలో ఎవరు ఒప్పుకుంటారు? అనే అంశంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


విడుదల ఎప్పుడంటే?


ఇక ప్రస్తుతం ప్రభాస్ మోకాలికి చికిత్స తీసుకుంటున్నారు. మోకాలి గాయానికి రీసెంట్ గా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక, ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయ్యకే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాలని భావిస్తున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ స్పెషల్ సాంగ్ యాడ్ అయితే, సినిమాకు మరింత ఊపు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ‘సలార్’ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నవంబర్ లేదంటే డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండూ కాదంటే వచ్చే సంక్రాతి బరిలో దించాలని మేకర్స్ భావిస్తున్నారట. 


జర్నలిస్టుగా కనిపించనున్న శృతి హాసన్


దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతుందని మేకర్స్ వెల్లడించారు.  అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ‘Kalki 2898 AD’ లో నటిస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial