రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా 'సలార్'. డార్లింగ్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 'సలార్‌: సీజ్‌ ఫైర్‌' పేరుతో సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ప్రభాస్ మాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన టీజర్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ రాబట్టి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచడం లేదని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 'సలార్' టీమ్ తాజాగా వాళ్ళని ఖుషీ చేసే న్యూస్ తో వచ్చింది. 


'సలార్: పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌' సినిమాలో సాంగ్స్ కు పెద్దగా స్కోప్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు మూడు బిట్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ గా వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ కు విన్నవిస్తూ వస్తున్నారు. అభిమానుల మొర ఆలకించిన చిత్ర బృందం.. ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్న ట్రైలర్ 'అతి త్వరలో' రాబోతోంది. ఈ విషయాన్ని హాంబలే ఫిలిమ్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్ లోని షాట్స్ తో కట్ చేసిన వీడియోని షేర్ చేసారు. 


'సలార్ – సీజ్‌ఫైర్‌' ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మేకర్స్ అనౌన్స్ చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఈ న్యూస్ తో డార్లింగ్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రభాస్ పేస్ ని రివీల్ చేయకుండా, డార్లింగ్ తో ఒక్క డైలాగ్ కూడా చెప్పించకుండా కట్ చేసిన టీజరే విధ్వంసం సృష్టిస్తే.. ట్రైలర్ తో ఎలాంటి బీభత్సం సృష్టిస్తారని కామెంట్లు చేస్తున్నారు. మరి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ప్రకటిస్తారేమో చూడాలి.


ఇప్పటి వరకూ 'సలార్' నుంచి రెండు మూడు పోస్టర్లు, టీజర్ మాత్రమే బయటకు వచ్చాయి. అవే ఈ పాన్ ఇండియా సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టాయి.. భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. బాక్సాఫీస్ వద్ద డైనోసర్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కలెక్షన్స్ అంచనా వేయడం ప్రారంభించారు. ఇది కచ్చితంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'KGF' చిత్రానికి రెట్టింపు ఉంటుందని, సీజ్‌ఫైర్‌ తో  థియేటర్లు సీజ్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు. 


'సలార్' మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు, మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక, టిన్ను ఆనంద్ పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే వరదరాజు మన్నార్ గా పృథ్వీరాజ్ లుక్ బాగా ఆకట్టుకుంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సలార్: పార్ట్ 1' 2023 సెప్టెంబర్ 28న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది.