Salaar Box Office Collections: ఈరోజుల్లో ఒక స్టార్ హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు.. దాని కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలవుతుంది. ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది? ఏ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది? అనే విషయాలపై ఫ్యాన్స్ చర్చలు పెడుతున్నారు. ప్రభాస్ సినిమా ‘సలార్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’.. చాలారోజుల తర్వాత ఈ ప్యాన్ ఇండియా హీరోకు మంచి హిట్‌ను తెచ్చిపెట్టింది. దీంతో అసలు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేదానిపై సోషల్ మీడియా దృష్టి పెట్టింది. అయితే ఇప్పటికే ‘సలార్’ కలెక్షన్స్.. ‘సాహో’ కలెక్షన్స్‌ను మించిపోయినట్టు తెలుస్తోంది.


మునుపటి సినిమాలకంటే ఎక్కువ..


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ చేసిన ‘సలార్’.. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ అందుకోవడంతో తమ ఫేవరెట్ హీరోకు చాలాకాలం తర్వాత హిట్ లభించింది అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ప్రభాస్ ముందు నటించిన సినిమాలు.. ‘సాహో’, ‘రాధే శ్యామ్’.. ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ టాక్ అందుకోలేకపోయినా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులను బ్రేక్ చేశాయి. ఇక ఇప్పుడు ‘సలార్’కు ఏకంగా పాజిటివ్ టాక్ రావడంతో ఆ మూవీ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.


తగ్గిపోతున్న ప్రేక్షకులు..


దేశవ్యాప్తంగా ‘సలార్’.. రూ.318 కోట్లను కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.550 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. బాలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ ఉండడంతో హిందీ వర్షన్‌లో రూ.110.48 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. అన్ని భాషలకంటే ‘సలార్’కు తెలుగులోనే ఎక్కువ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. విడుదలయ్యి వారం అవుతున్నా కూడా ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ‘సలార్’కు 30.69 శాతం ఆక్యూపెన్సీ కనిపించింది. ఇక మలయాళంలో 19.20 శాతం, తమిళంలో 19.45 శాతం ఆక్యూపెన్సీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ రేసులో ‘డెవిల్’, ‘బబుల్‌గమ్’ మూవీస్‌కు మంచి టాక్ వచ్చినా.. ‘సలార్’ ముందు నిలుస్తాయో లేదో చూడాలి. ఇయర్ ఎండ్, న్యూ ఇయర్, వీకెండ్ నేపథ్యంలో ‘సలార్’కు మళ్లీ ఆక్యూపెన్సీ పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.


‘డంకీ’తో పోలిస్తే..


‘సలార్’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘డంకీ’ రిలీజ్ అయ్యింది. కానీ ఆ మూవీకి యావరేజ్ టాక్ లభించడంతో ప్రేక్షకులంతా ‘సలార్’ను చూడడానికే ఇష్టపడ్డారు. కానీ మొదటిరోజు థియేటర్లలో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన తర్వాత సోమవారం వచ్చేసరికి ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. విడుదలయిన రోజే ‘సలార్’కు రూ.90.7 కోట్ల కలెక్షన్స్ లభించాయి. ఆ తర్వాత రోజు రూ.56.35 కలెక్షన్స్, మూడో రోజు రూ.62.05 కలెక్షన్స్‌ను సాధించింది ఈ సినిమా. మొత్తానికి విడుదలయిన మొదటి వారంలో రూ.308 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది ‘సలార్’. ప్రస్తుతం రోజురోజుకీ ‘సలార్’ కలెక్షన్స్ తగ్గిపోగా.. న్యూ ఇయర్ వీకెండ్‌లో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు.


Also Read: ‘కల్కి’లో ఫ్యూచర్‌ ప్రభాస్‌ను చూస్తారు - ట్రైలర్, రిలీజ్ డేట్‌పై నాగ్‌ అశ్విన్‌ కీలక అప్‌డేట్