డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ కమెడియన్ అలీ బంధువు కోసం ఆయన పెదకాపు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఇంతకీ, అది ఏ సినిమాలో? ఆయన లుక్ ఎలా ఉంది? వంటి వివరాల్లోకి వెళితే...
'ప్రణయ గోదారి'తో హీరోగా అలీ బంధువు!
ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నటుల్లో ఆలీ (Comedian Ali) ఒకరు. ఆ తర్వాత ఆయన తమ్ముడు కూడా పరిశ్రమలోకి వచ్చారు. ఇప్పుడు ఆలీ ఫ్యామిలీ నుంచి మరొకరు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఆయన బంధువు సదన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ప్రణయ గోదారి' (Pranaya Godari Movie). పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. సునీల్ రావినూతల ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ళ లింగయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సాయి కుమార్ లుక్ విడుదల చేసిన కోమటిరెడ్డి!
Sai Kumar Role In Pranaya Godari Movie: 'ప్రణయ గోదారి' సినిమాలో పెదకాపు పాత్రలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ కనిపించనున్నారు. తెలంగాణ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ''మా మునుగోడు వాసి పారుమళ్ళ లింగయ్య 'ప్రణయ గోదారి'తో నిర్మాతగా మారడం సంతోషంగా ఉంది. ఆయనకు అభినందనలు. లాభాలు రావడంతో పాటు సినిమా రంగంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఈ చిత్ర బృందానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా'' అని అన్నారు.
గోదావరి పల్లె ప్రాంతాల్లో గ్రామీణ పెద్ద లేదంటే మోతుబరిగా సాయి కుమార్ యాక్ట్ చేసినట్టు ఆయన ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతోంది. తెల్లటి పంచె కట్టు, వైట్ షర్టు, చేతికి కడియం, మెడలో రుద్రాక్ష మాల, ఆ మీస కట్టు... ఆయన లుక్ రౌద్రంగా ఉందని చెప్పవచ్చు. ఆయన పవర్ ఫుల్ రోల్ చేశారని చిత్ర బృందం చెబుతోంది.
'ప్రణయ గోదారి' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''మా పెదకాపు సాయి కుమార్ గారి ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి థాంక్స్. ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయి. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన శైలి ఆవిష్కరించడం కోసం సహజమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. అతి త్వరలోనే విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.
సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటించిన 'ప్రణయ గోదారి' సినిమాలో సాయి కుమార్ ప్రధాన పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, ఛాయాగ్రహణం: ఈదర ప్రసాద్, నృత్య దర్శకత్వం: కళాధర్ - మోహన కృష్ణ - రజని, కూర్పు: కొడగంటి వీక్షిత వేణు, కళ: విజయకృష్ణ.