SDT18 Titled As SYG: మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్, టైటిల్, రిలీజ్ డేట్లను ఒకేసారి విడుదల చేశారు. SDT18 అనే వర్కింగ్ టైటిల్ మీద లాంచ్ అయిన ఈ సినిమాకు ‘ఎస్‌వైజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘సంబరాల ఏటి గట్టు’ అనేది క్యాప్షన్‌గా పెట్టారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2025 సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
2023లో ‘బ్రో’, ‘విరూపాక్ష’ సినిమాలతో అలరించిన సాయి దుర్గా తేజ్ ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ఇటీవలే ‘హనుమాన్’తో పాన్ ఇండియా హిట్ కొట్టారు.
రామ్ చరణ్ చేతుల మీదుగా...ఈ సినిమాలో ఏం ఉంటుందో చూపించే గ్లింప్స్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్‌ను చాలా వయొలెంట్‌గా చూపించారు. నరికేసిన చెట్టు మొద్దు మీద మాసీగా కూర్చున్న సాయి దుర్గా తేజ్‌ను గ్లింప్స్‌లో చూడవచ్చు. తర్వాత తన మీదకు వస్తున్న రౌడీలపై విరుచుకుపడి చంపడం చూపించారు. చివర్లో సాయి దుర్గా తేజ్ చాలా పవర్‌ఫుల్‌గా రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం వినవచ్చు.
ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్ ఫిజికల్‌గా కూడా చాలా మేకోవర్ అయ్యారు. వారియర్ తరహాలో సిక్స్ ప్యాక్‌ను చూడవచ్చు. సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి అద్బుతమైన విజువల్స్‌ను చూపించారు. సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ కూడా అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ‘ఎస్‌వైజీ’లో సాయి దుర్గా తేజ్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘అఖండ 2’తో పోటీ...2025 సెప్టెంబర్ 25వ తేదీన ‘ఎస్‌వైజీ’ విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. అదే రోజున నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2’ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!