ఒక సినిమా కలెక్షన్స్ గురించి మేకర్స్ ఏది చెప్తే అది నమ్మవలసి ఉంటుంది ప్రేక్షకులు. ఈ మధ్యకాలంలో కలెక్షన్స్ విషయంలో పెద్ద కాంట్రవర్సీనే జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా విడులదయితే చాలు.. మొదటిరోజే ఎన్నో కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు మేకర్స్. ఈ కలెక్షన్స్ కారణంగా ఫ్యాన్ వార్స్ కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఇప్పటికీ వారు చెప్పే లెక్కలు నిజమా కాదా అని ఎవరికి తెలియదు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ కలెక్షన్స్ విషయంలో కూడా అలాగే కాంట్రవర్సీనే నడుస్తోంది. పైగా ఈ కాంట్రవర్సీకి కాస్త పొలిటికల్ టచ్ కూడా యాడ్ అయ్యింది.


‘బ్రో’ కలెక్షన్స్ అదుర్స్


పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని తెరకెక్కించిన ఈ రీమేక్.. ఒరిజినల్ మూవీ అయిన ‘వినోదాయ సితమ్’కు చాలా భిన్నంగా ఉందని మేకర్స్ ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. బ్రో షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో అడ్డంకుల మధ్య షూటింగ్ కొనసాగింది. ఫైనల్‌గా ఎవరూ ఊహించని విధంగా కొన్నిరోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. సినిమా విడుదలయినప్పటి నుంచి బ్రోలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూశామంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. అదే విధంగా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.


పవన్ కళ్యాణ్ మునుపటి చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌తో పోల్చుకుంటే బ్రోకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది తప్పు అని నిరూపించడానికి అంబటి రాంబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలో శ్యాం బాబు ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకున్న అంబటి రాంబాబు.. కలెక్షన్స్ విషయంలో బ్రో చిత్రాన్ని టార్గెట్ చేశారు. వారు అధికారికంగా ప్రకటించిన కలెక్షన్స్ తప్పు అని నిరూపిస్తానని ఓపెన్‌గా ఛాలెంజ్ చేశారు. కలెక్షన్స్ తప్పు అని చూపించి బ్రోను డిసాస్టర్‌గా ప్రకటించాలని ఆయన ప్రయత్నం. అంతే కాకుండా సినిమాలో పలువురు రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను తప్పుగా చూపించినందుకు బ్రో ఫిల్మ్‌మేకర్స్‌కు, రైటర్స్‌కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. సినిమాలో శ్యాం బాబు అనే క్యారెక్టర్‌కు తన పోలికలు పెట్టారంటూ త్రివిక్రమ్‌ను విమర్శించారు.


అంబటి రాంబాబు వార్నింగ్‌పై సాయి ధరమ్ తేజ్ స్పందన


అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌కు, ఇచ్చిన వార్నింగ్‌కు బ్రో మూవీ టీమ్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తాజాగా ‘బ్రో’ సక్సెస్ టూర్ కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మాత్రం ఈ విషయంపై స్పందించకుండా ఉండలేకపోయారు. ‘‘సినిమాను సినిమాలాగానే చూడాలి. సినిమాను, రాజకీయాలను లింక్ చేయడం కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు గారిని కించపరచడం కోసం మేము ఆ సీన్ చేయలేదు’’ అంటూ సాయి ధరమ్ తేజ్ మీడియాతో అన్నాడు. కానీ అంబటి రాంబాబు ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే జగన్ ప్రభుత్వం మరోసారి సినిమాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: పవన్‌కు ఎంత ఇచ్చామనేది చెప్పను, అంబటివి ఆరోపణలు మాత్రమే - 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్