కొందరు సినీ తారలు తమ పుట్టినరోజును ఫారిన్ దేశాలకు వెళ్లి ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ జరుపుకోవాలి అనుకుంటారు. కొందరు అసలు హడావిడి లేకుండా సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం తమ పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేసి నలుగురు తమరికి అండగా నిలబడాలని అనుకుంటారు. సాయి ధరమ్ తేజ కూడా అదే అనుకున్నాడు. అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి ఆలోచనతో ఈ మెగా హీరో ముందుకొచ్చాడు. అంతే కాకుండా తను తీసుకున్న ఈ నిర్ణయంలో ప్రేక్షకుల సపోర్ట్‌ను కూడా కోరుకుంటూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్.


నా హీరోల కోసం..
తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ నోట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ‘ఇది నా హీరోల కోసం. మనమందరం ఇక్కడ ఏదో ఒక మార్పు తీసుకురావడానికే వచ్చాం. నేను నా జీవితంలో మరో సంవత్సరం ముందుకు వెళ్తున్నందుకు నా మనసుకు దగ్గరయిన ఒక మార్పును చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పుట్టినరోజున నేను రూ.10 లక్షలు వీరనారీలకు అంటే ఆర్మీలో ఉంటూ మన భవిష్యత్తు కోసం వారి నేటిని త్యాగం చేస్తూ మరణించిన సైనికుల భార్యలకు విరాళంగా ఇస్తానని మాటిస్తున్నాను. అంతే కాకుండా రూ.10 లక్షలు మన ప్రతీరోజూ రక్షణ కోసం కష్టపడుతున్న బాధ్యతగల ఏపీ, తెలంగాణ పోలీసులకు విరాళంగా ఇస్తున్నాను’ అంటూ తన నిర్ణయాన్ని బయటపెట్టాడు సాయి ధరమ్ తేజ్.


విరాళాలు వద్దు.. గౌరవం చాలు..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా మన రక్షణ కోసం పనిచేసిన, పనిచేస్తున్న వారికి ఆర్థిక సాయం అందించాలని అనుకోవడం గొప్ప విషయమని అంటున్నారు. ‘నేను తీసుకున్న ఈ నిర్ణయంలో మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అది మీ విరాళాల రూపంలో కాదు. సైనికులు, ఆర్మీ, పోలీసులు మనకోసం చేస్తున్న పనికి మీరు చూపించే అభిమానం, గౌరవం రూపంలో’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాట.. నెటిజన్లను మరింత ఎక్కువగా ఆకట్టుకుంది. తనలాగానే ఇతరులు కూడా సైనికులకు, పోలీసులకు, వారు పడే కష్టాలకు కాస్త మర్యద ఇచ్చిన చాలు అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు.


‘గాంజా శంకర్’గా..
ఇక తన పుట్టినరోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్.. తన నిర్ణయాన్ని ఒక లెటర్ రూపంలో చెప్పడం మాత్రమే కాకుండా దానికి ఒక క్యాప్షన్‌ను కూడా జతచేశాడు. ‘నా బాధ్యతను మెరుగుపరుచుకుంటున్నాను, మన భవిష్యత్తు కోసం వారి ప్రతిరోజును త్యాగం చేస్తున్న వారిపై గౌరవంతో ఈ పనిచేస్తున్నాను. ఇండియన్ ఆర్మీకి, ఏపీ, తెలంగాణ పోలీస్‌లకు, త్యాగం చేస్తున్న ప్రతీ కుటుంబానికి థాంక్యూ’ అని క్యాప్షన్‌లో చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఇక సినిమాల విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన తరువాతి మూవీ ‘గాంజా శంకర్’ నుండి గ్లింప్స్ విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ‘విరూపాక్ష’ ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ మెగా హీరో.. ‘గాంజా శంకర్’తో ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో చూడాలి.






Also Read: మెగా ఫ్యామిలీ 'శంకర్' - చిరు, పవన్, సాయి తేజ్ తర్వాత ఎవరొస్తారో?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial