Nithiin's Robinhood OTT Release On Zee5: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఓటీటీతో పాటే టీవీలోనూ ప్రీమియర్ కానుంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..

'రాబిన్ హుడ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'జీ5' (Zee5) సొంతం చేసుకోగా మే 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే రోజు 'జీ తెలుగు' ఛానల్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడైంది. 'జీ5' అప్‌కమింగ్ మూవీస్ విభాగంలో మే 10న 'రాబిన్ హుడ్' ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలిపింది.

అయితే, గత కొద్ది రోజులుగా 'జీ5' ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తోంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సైతం ఒకే రోజు అటు ఓటీటీ ఇటు టీవీలోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు 'రాబిన్ హుడ్' విషయంలోనూ అలానే చేస్తోంది.

Also Read: నేరుగా 'ఈటీవీ విన్'లోకి సుమంత్ 'అనగనగా' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది.

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన రామ్ (నితిన్) ఓ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతుంటాడు. తన లాంటి వారి ఆకలి, అవసరాలు తీర్చేందుకు చోరీలు చేస్తూ రాబిన్ హుడ్‌గా మారతాడు. దొంగతనం చేసిన డబ్బులతో అనాథ శరణాలయాలకు అండగా నిలుస్తాడు. అలా హోం మంత్రి (ఆడుకాలం నరేన్) బిజినెస్ పార్ట్‌నర్ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. దాంతో ఎలాగైనా 'రాబిన్‌హుడ్'ను పట్టుకోవాలని స్ట్రీక్ట్ పోలీస్ ఆఫీసర్ విక్టర్ వర్గీస్ (షైన్ టామ్ చాకో)ను రంగంలోకి దించుతారు. అతనికి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు రామ్. కొద్ది రోజులు చోరీలకు బ్రేక్ ఇచ్చి జాన్ స్నో (రాజేంద్ర ప్రసాద్) నడిపే ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ కంపెనీలో ఉద్యోగిగా చేరతాడు.

ఇదే టైంలో ఆ కంపెనీకి భారీ డీల్ వస్తుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయి ఇండియాకు వచ్చిన బిజినెస్ మ్యాన్ కూతురు నీరా వాసుదేవ్‌ (శ్రీ లీల) సెక్యూరిటీ బాధ్యతలు చూసుకోవడానికి కోటిన్నర ఆఫర్ చేస్తారు. నీరాను తన అమ్మమ్మ ఊరు రుద్రకొండ తీసుకువెళ్తారు. కొన్నేళ్లుగా ప్రపంచానికి దూరంగా ఆ ఊరి ప్రజలందరూ బ్రతకడానికి కారణం ఏమిటి? రుద్ర కొండను తన గుప్పెట్లో పెట్టుకున్న సామి (దేవదత్త నాగే) ఎవరు? నీరాను అతడు ఇండియా ఎందుకు రప్పించాడు? అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తోన్న డ్రగ్ మాఫియా నీరాను ఎందుకు టార్గెట్ చేసింది. వాళ్ల నుంచి నీరాను రామ్ ఎలా కాపాడాడు? వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.