న్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్వకత్వంలో నటించిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఈ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో నటుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయనపై దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రిషబ్ శెట్టి పై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. 


ఇటీవల ఓ కార్యక్రమంలో ‘కాంతార’ దర్శకుడు రిషబ్ శెట్టి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సమాధానాలు చెప్పారు. రిషబ్ శెట్టి గురించి నవాజ్ మాట్లాడుతూ.. ‘కాంతార’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని అన్నారు. ఈ సినిమా కోసం రిషబ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుందని చెప్పారు. నిజానికి రిషబ్ సినిమా కోసం కష్టపడే విధానం చూస్తే తనకు కూడా అసూయ కలిగిందని చెప్పారు. అయితే ఈ అసూయ వల్ల మనం చేసే పనిలో పోటీ వాతావరణం ఏర్పడుతుందని, అది మన కాళ్ళ మీద మనం నిలబడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు నవాజ్. తనకు అవకాశం వస్తే కన్నడ చిత్రాల్లో నటించాలని ఉందని అన్నారు. అది కూడా రిషబ్ తో కలసి పని చేసే అవకాశం వస్తే వెంటనే నటించడానికి సిద్దంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.


తన గురించి నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు రిషబ్ స్పందిస్తూ.. నవాజ్ అంటే తనకు ముందునుంచీ అభిమానం ఉందని అన్నారు. నవాజ్ సినిమాలు చాలా చూశానని, అతని నటన ఎంతో అద్భుతంగా ఉంటుదన్నారు. అలాగే ఆయన సినీ జీవితం కూడా తనకు ఎంతో ప్రేరణ కలిగించిందని అన్నారు. ఆయన లైఫ్ లో ఎంతో కష్టపడి పైకి వచ్చారని చెప్పారు. నవాజ్ కూడా తనలాంటి వారేనని, ఏ బ్యాగ్రౌండ్ లేకుండా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడని అన్నారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయనకు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఇలాంటి నటులు ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తారని వ్యాఖ్యానించారు రిషబ్. 


ఇక ‘కాంతార’ సినిమా సైలెంట్ గా విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈ చిత్రం ఒక్క కన్నడలోనే 168.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. హిందీ లో 96 కోట్ల కొల్లగొట్టింది. ఆంధ్ర, తెలంగాణలో రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19.20 కోట్లు సాధించి రికార్డులు తిరగరాసింది. అంతేకాకుండా ఓవ‌ర్ సీస్‌ లో ఈ చిత్రానికి రూ.44 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్‌ వ‌చ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా రూ.400 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ సినిమాలకు కొన్ని వారాల పాటు పోటీ ఇవ్వడం గమనార్హం. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ సినిమాను నిర్మించారు. 



Read Also: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా లుక్ ఇదే, ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయిందిగా!