Rishab Shetty And Crew Escapes From Accident During Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కాంతార'. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫ్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఇటీవల వరుస ప్రమాదాలు మూవీ టీంను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

రిషబ్‌కు తప్పిన ప్రమాదం

ప్రస్తుతం కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద మూవీ షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా టీం ప్రమాదం నుంచి తప్పించుకుంది. శనివారం సాయంత్రం దాదాపు 30 మంది ఆర్టిస్టులు పడవపై జలాశయంలో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఆ సమయంలో హీరో రిషభ్ కూడా అదే బోటులో ఉన్నారు. వెను వెంటనే వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కెమెరాతో పాటు కొన్ని టెక్నికల్ వస్తువులు నీట మునిగాయి. ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - టీజర్ గ్లింప్స్.. రెబల్ వైబ్ కోసం వెయిటింగ్

ఎందుకిలా జరుగుతోంది?

'కాంతార చాప్టర్ 1' షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ మూవీ టీంను ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతేడాది నవంబరులో షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ వ్యాన్.. కొల్లూరు సమీపంలో జడ్కల్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఆ తర్వాత మేలో కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కొల్లూరులోని నదిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. అయితే, ఆ రోజు షూటింగ్ జరగలేదని టీం క్లారిటీ ఇచ్చింది. 

ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే 'కాంతార' ఆర్టిస్ట్ రాకేష్ పూజారి గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా.. సినిమా షూటింగ్ సెట్‌లోనే మరో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూరులో షూటింగ్ జరుగుతుండగా.. నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజు (43) గుండెపోటుతో కుప్పకూలిపోయారు. గురువారం రాత్రి సెట్‌లోకి అడుగుపెట్టిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. మూవీ టీం ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పుంజుర్లి వార్నింగ్ నిజమౌతుందా?

'కాంతార' షూటింగ్‌లో వరుస ప్రమాదాలు చర్చనీయాంశమవుతున్నాయి. షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషభ్.. మంగళూరులోని కద్రి బరేబైల్‌లో జరిగిన ఉత్సవాలకు వెళ్లగా.. పుంజుర్లి పూనిన పూజారి రిషభ్‌తో మాట్లాడారు. 'నీ చుట్టూ శత్రువులు ఉన్నారని.. భారీ కుట్రకు తెర తీశారని.. నువ్వు నమ్మిన దేవుడు కచ్చితంగా కాపాడతాడు' అంటూ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హెచ్చరికలే ఇప్పుడు నిజం అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 

ఇక 'కాంతార చాప్టర్ 1' విషయానికొస్తే.. 'కాంతార'కు ఫ్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫస్ట్ స్టోరీ ఎక్కడి నుంచి ప్రారంభమైందో దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నారు.