Renu Desai about Second Marriage: సినీ పరిశ్రమలో విడాకులు అనేవి కామన్‌గా జరుగుతుంటాయి. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కూడా నటీనటులు మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. అదే క్రమంలో వారిపై ఎన్నో రూమర్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌పై కూడా అలాంటి రూమర్సే వచ్చాయి. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్లకు వేరొకరితో రేణూ దేశాయ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. అసలు ఎందుకలా జరిగిందో తాజాగా బయటపెట్టారు రేణూ.


అరేంజ్ మ్యారేజ్..


‘‘నేను చాలా ఏళ్లుగా దీని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. నేను నా వర్క్ గురించి, సినిమాల గురించి, టీవీ షో చేస్తే దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాటికోసం మీరు మీ డబ్బులు పెడుతున్నారు. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి నేనెందుకు మాట్లాడాలి? అందుకే నేను సైలెంట్‌గా ఉండాలి అనుకున్నాను. కానీ నా గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని అనుకుంటున్నాను’’ అని రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్. అది లవ్ మ్యారేజ్ కాదని, అరేంజ్ అని క్లారిటీ ఇచ్చారు. కేవలం తన కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులకు మాత్రమే ఎంగేజ్‌మెంట్ సంగతి తెలుసని అన్నారు.


పెద్ద వార్త అయ్యింది..


‘‘నాకు తెలిసిన వాళ్లంతా తను కరెక్ట్ మనిషి అన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి తోడు కావాలి అని చెప్పేసరికి నేను కూడా ఒప్పుకున్నాను. అందుకే నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను. ఫోటో పెట్టాను. అది పెద్ద వార్త అయ్యింది. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. నా కూతురికి అప్పటికీ ఏడేళ్లే. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను నా భర్తతో సమయాన్ని గడపాలి, బయటికి వెళ్లాలి. అప్పుడే నా కూతురిని చూశాను. తను ఇంకా చిన్నపిల్లే. తనకు నేను కావాలి. తండ్రి ఎలాగో లేడు.. తల్లి కూడా లేకపోతే ఎలా అనుకున్నాను. అది కరెక్టా కాదా నాకు తెలియదు కానీ నా ఆలోచన ప్రకారం చేశాను. పెళ్లి అనే నిర్ణయం తీసుకోవడానికి ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే బాగుంటుంది అనిపించింది అందుకే ఆ పెళ్లి ఆపేశాను’’ అని వివరణ ఇచ్చారు రేణూ దేశాయ్.


రెండేళ్ల తర్వాత..


ఇప్పటికైనా రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటారా అని చాలామందిలో అనుమానం ఉండగా.. దానిపై కూడా తను క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి అంటే చాలా పవిత్రమైనది. ఇద్దరు వ్యక్తులు మతపరమైన ఆచారంతో ఒక్కటవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ, నాన్న కంటే ఆ రిలేషన్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత అంటే ఆద్య కాలేజ్‌కు వెళ్లడం ప్రారంభించిన తర్వాత నేను నా గురించి ఆలోచించడం మొదలుపెడతాను’’ అని బయటపెట్టారు రేణూ. తన పిల్లలకు రెండో పెళ్లి ఇష్టమేనా అని అడగగా.. తన సంతోషమే వాళ్ల సంతోషమని, ఇప్పటికీ వారు పెళ్లి చేసుకోమనే చెప్తున్నారని అన్నారు.


Also Read: ఆ మూవీలో దారుణమైన అనుభవం, అందుకు చిన్మయి దగ్గర ఆధారాలు లేవు - నటి కస్తూరి శంకర్ వ్యాఖ్యలు