నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ దసరాకి 'భగవంత్ కేసరి' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ మాస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. సినిమా మంచి సక్సెస్ అవడంతో మూవీ టీం తాజాగా సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో 'భగవంత్ కేసరి'కి సంబంధించి బాలకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యతో చేసిన మొదటి సినిమా ఇది.


ట్రైలర్, సాంగ్స్ తో ఆడియన్స్ లో అంచనాలను పెంచిన ఈ చిత్రం అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యాక్షన్ తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా బాలయ్య ఈ చిత్రంలో తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టేసారు. తెలంగాణ యాస బాలయ్యకి తొలిసారి అయినప్పటికీ ఏమాత్రం తడబడకుండా ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్యను సరికొత్తగా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడం ప్రేక్షకుల్ని సైతం మెప్పించింది.


దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే రూ.140 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. సినిమా మంచి విజయాన్ని అందుకోవటంతో మూవీ టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే, త్వరలోనే 'భగవంత్ కేసరి' హిందీలో రిలీజ్ కాబోతోందట. ఈ విషయం గురించి బాలయ్య సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, త్వరలోనే 'భగవంత్ కేసరి' హిందీలో డబ్ కాబోతోందని, అందులో తన పాత్రకు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పానని పేర్కొన్నారు. ఆ మాట విన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు.


"నాకు, మా నాన్నకు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. అందుకే హిందీలో డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. ఈ సినిమాతో హిందీ భాష పై నాకున్న పట్టును మీరు త్వరలోనే చూస్తారు. తెలుగు వాళ్ళ సత్తా ఈ సినిమా నిరూపిస్తుంది" అంటూ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు బాలయ్య. దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 'భగవంత్ కేసరి' హిందీ డబ్బింగ్ వర్షన్ ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'భగవంత్ కేసరి' మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించారు. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.


Also Read : మరోసారి బన్నీతో చిందులేయనున్న సమంత - 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial