మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్–ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ షూట్ ఔట్ లో నలుగురు మరణించారు. ఈ దుర్ఘటనపై తమిళ నటుడు, నిర్మాత రాజ్‌ కిరణ్ స్పందిస్తూ.. ముస్లింలు తమకు అన్యాయం జరిగినప్పటికీ సహనంతో ఉన్నారని, వారి మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు.


సోమవారం జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ కాల్పులు జరపడంతో, RPF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ , ముగ్గురు ముస్లిం ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముస్లిం అయిన రాజ్‌ కిరణ్ ఈ ఘటనపై స్పందిస్తూ, తమ మౌనాన్ని సహనాన్ని పిరికితనంగా అర్థం చేసుకోవద్దని ఒక ప్రకటనలో తెలిపారు. 


Also Read: తమిళ దర్శకులతో పవన్ కళ్యాణ్ - హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి బ్రో!


"ముస్లింలకు ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎంత క్రూరమైన నేరాలకు గురైనా, వారు అన్నింటినీ భరించి, ఇతర వర్గాలకు తమ చేతనైనంత సాయం చేస్తున్నారు. మేం బతకడం చేతకానివాళ్ళం కాదు. మేం పిరికివాళ్ళం కాదు. మా ప్రాణాలకు భయపడం. మేము సహనంతో శాంతియుతంగా ఉన్నామంటే కారణం ముహమ్మద్ ప్రవక్త"


"మేము దేవుని మార్గంలో మరణాన్ని ప్రేమించాలి అనే సూత్రాన్ని నమ్ముతాము. మేము దేవుని చివరి దూత, ఇస్లామిక్ ప్రజల గొప్ప నాయకుడు, ప్రవక్త యొక్క జీవితాన్ని ఆయన మాటలను అనుసరిస్తాము. కాబట్టి మేము సహనం పాటిస్తాం. ఇంతకంటే నిధి లేదు కాబట్టి మేము సహనం పాటిస్తాం" అని రాజ్ కిరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్‌ కిరణ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి. 


కాగా, రాజ్ కిరణ్ ఒక తమిళ ముస్లిం అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన అసలు పేరు జె మొహిదీన్ అబ్దుల్ ఖాదర్. 1989లో 'ఎన్నె పేట రాసా' అనే చిత్రంతో తెరగేట్రం చేశారు. 'ఎన్ రసవిన్ మనసులే' (1991) సినిమా ద్వారా హీరోగా మారాడు. 30కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. 2017లో ధనుష్ దర్శకత్వంలో 'పా పాండి'లో కథానాయకుడిగా నటించారు. ఇక 'పందెంకోడి', 'పందెంకోడి 2' 'ముని' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'గోవిందుడు అందరివాడేలే' మూవీలో ప్రకాశ్ రాజ్ పోషించిన పాత్ర కోసం ముందుగా రాజ్ కిరణ్ నే తీసుకున్నారు. అయితే కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆ పాత్రకు సెట్ అవ్వడం లేదని మార్చేశారని టాక్. 


ఇక జైపుర్‌-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైల్ ఘటన విషయానికొస్తే.. చేతన్‌ సింగ్‌ జరిపిన కాల్పుల్లో మరణించిన నలుగురిలో హైదరాబాద్‌ వాసి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సయ్యద్‌ సైఫుద్దీన్‌(43) హైదరాబాద్‌ నాంపల్లి ఏసీగార్డ్స్‌ ప్రాంతంలో నివసిస్తున్నట్లు వెల్లడైంది. 


Also Read: ఎంత పనిచేసావ్ 'బ్రో' - రొమాంటిక్ బ్యూటీకి మళ్ళీ నిరాశే మిగిలిందా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial