Ravi Teja At Mr Bachchan Pre Release Event: ఆగస్ట్ మూడో వారంలో లాంగ్ వీకెండ్ కోసం ఎన్నో సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ఇందులో ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయినా వాటితో పోటీకి సిద్ధమంటూ మాస్ మహారాజ్ రవితేజ కూడా బరిలోకి దిగనున్నారు. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచారు మేకర్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చి అందరినీ అలరించారు రవితేజ.
అందరికీ థాంక్యూ..
మామూలుగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయినా అందరూ మాట్లాడిన తర్వాత హీరో మాట్లాడతాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’లో అలా కాదు. ముందుగా రవితేజనే మాట్లాడడానికి ముందుకొచ్చారు. అది ఎందుకో కూడా ఆయన వివరించారు. ‘‘మైక్‌ను సరిగ్గా వాడే మనుషులు చాలా తక్కువమంది ఉంటారు. అందులో హరీష్ ఒకడు. ఇరగదీసి మైక్ అంతుచూస్తాడు. నా తర్వాత తను మాట్లాడితే మంచిది అనిపించి నేను ముందు మాట్లాడడానికి వచ్చాను’’ అని తెలిపారు రవితేజ. ఆ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ కోసం పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు పేరుపేరునా థ్యాంక్స్ చెప్పుకున్నారు. చాలామంది టెక్నీషియన్లను కూడా ప్రత్యేకంగా పిలిచి ప్రశంసించారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాటోగ్రాఫర్ వల్ల భాగ్యశ్రీ మరింత అందంగా కనిపించిందని, సినిమా అంతా లడ్డులాగా వచ్చిందని వ్యాఖ్యలు చేశారు రవితేజ.
షాకిచ్చాడు..
రవితేజ స్టేజ్‌పై మాట్లాడుతుండగానే ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది చూసి రవితేజ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘‘అలా రాకూడదు. ఇలా వచ్చేస్తే భయపడతాం. భయపెట్టకండి’’ అని ఫ్యాన్స్‌కు చెప్పారు. ఈ ఈవెంట్‌కు మిక్కీ జే మేయర్ హీరో అంటూ తన గురించి చెప్పుకొచ్చారు. ‘‘తన నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఒకరకంగా షాకిచ్చాడు. మొదటిసారి హరీష్ నాకు ట్యూన్స్ వినిపించినప్పుడు ఇది మిక్కీనా అనిపించింది’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రవితేజ. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఒక ఊపుఊపేస్తోంది. సినిమాలో అమ్మాయి మామూలుగా లేదు. డబ్బింగ్ తనే చెప్పింది’’ అంటూ తనకు ఆల్ ది బెస్ట్ తెలిపారు రవితేజ.
హ్యాట్రిక్ తీయాలి..
చివరిగా హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి నాకంటే ఎక్కువ తనే చెప్పాడు. తనే బాగా చెప్తాడు కూడా. ఈ సినిమా హిట్ అయ్యి తరువాత హ్యాట్రిక్ తీయాలి. ఎందుకంటే షాక్ డిసప్పాయింట్ చేసింది. దర్శకులందరూ హార్డ్ వర్క్ చేస్తారు. కానీ హరీష్ హార్డ్ వర్క్ వేరు. అన్ని శాఖలు సరిగ్గా ప్లాన్ చేసుకుంటాడు’’ అని ప్రశంసించారు రవితేజ. హరీష్ అభిమానంగా తన కాళ్లు పట్టుకోబోతుంటే అలా చేయొద్దు ఇబ్బందిగా ఉంటుందంటూ తన స్పీచ్‌ను ముగించారు. చివరిగా హరీష్ శంకర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. ఉదయం 9 నుంచి 6 వరకు ఒకలాగా, సాయంత్రం 6 నుంచి మరొకలాగా ఉంటాడని చెప్పి నవ్వారు రవితేజ.
Also Read: ‘కంగువా’ ట్రైలర్‌లో ఇవి కనిపెట్టారా? సూర్య సినిమాలో స్పార్టన్లు, ఏం ప్లాన్ చేశారయ్యా?