సౌత్ సినిమాలకు నార్త్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత, ఫిలిం మేకర్స్ అంతా బాలీవుడ్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రతీ హీరో కూడా ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాదిరిగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకోవాలని ఆశ పడుతున్నారు. ఇందులో భాగంగా తెలుగుతో పాటుగా మిగతా ప్రధాన భారతీయ భాషల్లో సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా హిందీ వెర్షన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ హీరో రవితేజ సైతం 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నించారు.
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 'పుష్ప' లాంటి రా అండ్ రస్టిక్ మూవీకి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో.. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని కూడా హిందీలోకి తీసుకెళ్లాలని మేకర్స్ ముందే నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్టుగానే గాయత్రీ భరద్వాజ్, నుపుర్ సనన్, అనుపమ్ ఖేర్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ ను ప్రాజెక్ట్ లో భాగం చేసారు. అందులోనూ అభిషేక్ అగర్వాల్ లాంటి పాన్ ఇండియా ప్రొడ్యూసర్ ఉండటంతో బాలీవుడ్ లోనూ ప్రాపర్ గా రిలీజ్ చేయగలిగారు. అయితే నార్త్ బెల్ట్ లో ఈ చిత్రం ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని దసరా సందర్భంగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేసారు. తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో రవితేజ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మూవీతో నేషనల్ వైడ్ సత్తా చాటాలని భావించారు. టీజర్, ట్రైలర్ కు నార్త్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సినిమా కచ్చితంగా అక్కడ ఘన విజయం సాధిస్తుందని నమ్మారు. అందుకే తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ప్రమోషన్స్ చేశారు. బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు, పలు టీవీ ప్రోగ్రామ్స్ తో సందడి చేసారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
'టైగర్ నాగేశ్వరరావు' చుట్టూ నెలకొన్న హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా డబ్బులు వెనక్కి వచ్చాయని తెలుస్తోంది. అయితే భారీ అంచనాలు నడుమ రిలీజైన ఈ మూవీ ఆశించిన మేర థియేట్రికల్ రెవెన్యూ రాబట్టలేకపోయింది. ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని మేకర్స్ ప్రకటించారు కానీ.. అందులో హిందీ వసూళ్ల వాటా చాలా తక్కువని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రవితేజ టీమ్ విపరీతంగా ప్రచారం చేసినా, దానికి తగ్గట్టుగా కలెక్షన్స్ రాలేదనేది మాత్రం స్పష్టం అవుతోంది.
తెలుగు విషయానికొస్తే, రెండో వారంలోనూ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా బాగానే పెరఫార్మ్ చేస్తోంది. 3 గంటల నిడివిని 2 గంటల 37 నిమిషాలకు తగ్గించిన తర్వాత జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి, బాలయ్య 'భగవంత్ కేసరి'తో పాటుగా రవితేజ చిత్రానికి మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ దోపిడీ ఎలా కొనసాగుతుందో, బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.
Also Read: ఓవైపు యాక్షన్, మరోవైపు డైరెక్షన్ - యాక్టర్స్‌గా రాణిస్తున్న డైరెక్టర్స్ వీరే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial