Eagle: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు. కానీ చివరకు ఇండస్ట్రీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఛాంబర్ వినతిని మన్నించి పొంగల్ బరి నుంచి తప్పుకున్న రవితేజ సినిమాకు ఇప్పుడు సోలో రిలీజ్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. 


ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్ 'యాత్ర 2' చిత్రాన్ని ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని దర్శకుడు మహి వి. రాఘవ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సందీప్ కిషన్ హీరోగా అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న 'ఊరి పేరు భైరవకోన' చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు లేటెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లాల్ సలామ్' మూవీని 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. దీంతో రవితేజ 'ఈగల్' మూవీ రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటుగా ఒక తమిళ డబ్బింగ్ చిత్రంతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


సంక్రాంతికి 'హనుమాన్', 'ఈగల్', 'సైంధవ్', 'గుంటూరు కారం', 'నా సామిరంగ' వంటి ఐదు సినిమాలు పోటీలో ఉండటంతో.. రెండు రాష్ట్రాల్లో థియేటర్లలో వివాదాన్ని పరిష్కరించడానికి 15 రోజుల క్రితం టాలీవుడ్ కు సంబంధించిన మూడు సంస్థలు మీటింగ్ పెట్టారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కలిసి ఐదుగురు ప్రొడ్యూసర్లకు గ్రౌండ్ రియాలిటీ వివరించి సహకరించమని కోరారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ రేసు నుండి తప్పుకున్న సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా చూస్తామని ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. 


Also Read: తెలుగులోనూ విజయ్​ సేతుపతి, కత్రినాల​ 'మేరీ క్రిస్మస్' - సస్పెన్స్ థ్రిల్లర్‌తో 'అంధాధున్' డైరెక్టర్!


ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ బాగు కోసం 'ఈగల్' మేకర్స్ ముందుకు వచ్చి తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నారు. ఒక మాస్ హీరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ వెనక్కి తగ్గడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఈ రోజుల్లో బిజినెస్ పరంగా కూడా అదంత సులువైన విషయం కాదు. కానీ రవితేజ అన్ని విధాలుగా ఆలోచించి తమ సినిమాని వాయిదా వేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మిగతా నలుగురు హీరోల చిత్రాల విడుదలకు సహకరించారు. అలాంటి హీరోకి ఫిబ్రవరి 9న కూడా పోటీ ఎదురవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకొని సంక్రాంతి రేసు నుంచి వైదొలిగిన 'ఈగల్' సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా చేస్తారేమో చూడాలి. 


కాగా, 'ఈగల్' సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలిసి దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే కూడా రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవ్ జాంద్ సంగీత సమకూరుస్తున్న ఈ సినిమాకు శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. 'టైగర్ నాగేశ్వర రావు' తర్వాత మాస్ రాజా నుంచి రాబోతున్న 'ఈగల్' కోసం ఫ్యాన్ ఆతృతగా వేచి చూస్తున్నారు. 


Also Read: రవితేజ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న ఫిబ్రవరి, ఎందుకంటే?