Jayam Ravi Long Post On Singer Kenishaa: కోలీవుడ్ స్టార్ జయం రవి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తి రవితో విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది ఆయన ప్రకటించారు. ఇటీవల సింగర్ కెనీషాతో రవి మోహన్ ఓ పెళ్లి వేడుకలో కనిపించగా.. మళ్లీ వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
కష్ట సమయంలో కెనీషా సపోర్ట్
తాజాగా.. జయం రవి (Jayam Ravi) ఇన్ స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కెనీషా (Kenishaa) ఎంతో మంచి వ్యక్తి అని.. ఆమెకు తగిన గౌరవ, మర్యాదలు దక్కాలని అన్నారు. తన మౌనం బలహీనత కాదని.. తన గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన జర్నీ.. తాను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలియని వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాను పెదవి విప్పక తప్పదంటూ 4 పేజీల సుదీర్ఘ లేఖను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
'వేధింపుల నుంచి కోలుకున్నా'
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న టైంలోనూ తన వ్యక్తిగత జీవితంపైనే కొందరు దృష్టి సారించడం బాధగా ఉందని జయం రవి అన్నారు. 'హార్డ్ వర్క్‌తో నా కెరీర్ నిర్మించుకున్నా. వ్యక్తిగత లాభం, చౌకబారు సానుభూతి కోసం నా గత వివాహ బంధాన్ని వాడుకోను. మానసిక, ఎమోషనల్, ఆర్థికపరమైన వేధింపుల నుంచి కోలుకున్నా. ఇన్నేళ్లుగా నా పేరెంట్స్‌ను కలవలేకపోయాను. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించా. ఎంతో ఆలోచించి ధైర్యం చేసి ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చా. విడాకుల నిర్ణయంపై ఇప్పటికే కుటుంబసభ్యులు, అభిమానులతో మాట్లాడా.
ఈ విషయంలో మౌనం కూడా తప్పేనని అర్థమైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఆయా వదంతులను పూర్తిగా ఖండిస్తున్నా. ప్రజల సానుభూతి, ఆర్థిక లాభం కోసం నా పిల్లలను ఓ సాధనంగా వాడుకోవడం చూస్తుంటే బాధగా ఉంది. నా పిల్లల క్షేమం కోసం నేను ఎప్పుడూ దేవున్ని ప్రార్థిస్తాను. ఎన్నో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఆర్తి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నా. నా పిల్లలను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు.' అని పేర్కొన్నారు.
కన్నీళ్లు, బాధ టైంలో అండగా నిలిచారు
స్నేహితులుగానే కెనీషాకు తనకు పరిచయం మొదలైనట్లు జయం రవి తెలిపారు. 'జీవితంలో నిరాళ, కన్నీళ్లు, బాధ మిగిలిన సమయంలో కెనీషా నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. కట్టుబట్టలతో ఓ రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమయంలో ఆమెనే నాకు అండగా ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెనుకాడలేదు. ఆమె గురించి, ఆమె వృత్తి గురించి ఎలాంటి అమర్యాదకరమైన ప్రచారాన్ని అనుమతించాలనుకోవడం లేదు.' అంటూ పోస్ట్‌లో జయం రవి పేర్కొన్నారు.
Also Read: డైరెక్టర్ రాజ్‌తో కలిసి సమంత ఫోటో - దర్శకుడి సతీమణి పోస్ట్ వైరల్
ఇదీ జరిగింది
అయితే, ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సింగర్ కెనీషా, జయం రవి కలిసి కనిపించగా.. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఆయన భార్య ఆర్తి రవి.. తనను ఇంటి నుంచి గెంటేశారని, పిల్లలను పట్టించుకోరని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టారు. తమ విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. దీనికి సింగర్ కెనీషా సైతం కౌంటర్ ఇచ్చారు. 'ఓ మగాడు ఎప్పుడూ ఎమోషన్స్‌కు లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. సైలెంట్‌గా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు.' అంటూ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే జయం రవి తాజాగా స్పందించారు.