సాంకేతిక అభివృద్ధి మానవ సమాజం అభివృద్ధికి గొప్ప సహకారం అందించినప్పటికీ, అదే సమయంలో పతనానికి కూడా కారణమవుతుంది. ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. మోసం, వ్యక్తులను మార్ఫింగ్ చేయడం ద్వారా అసభ్యంగా చిత్రీకరించడం వంటి అనేక రకాల నేరాలకు కొంతమంది నిరంతరం పాల్పడుతున్నారు. దీనిని నిరోధించడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా, కఠినమైన శిక్షలు విధించినా నేరాలు తగ్గడం లేదు. సాంకేతికత పెరుగుదుల మనిషి ఎదుగుదలకు దన్నుగా నిలవాలని వారికిని తొక్కే పరిస్థితికి రాకూడదని నేషనల్ క్రష్, నటి రష్మికా మందన్నా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతను సరైన విధంగానే ఉపయోగిద్దామని సూచించారు.
ఏఐ సాంకేతికత దుర్వినియోగం
ముఖ్యంగా ఏఐ సాంకేతికత వచ్చిన తర్వాత, అందులో జరిగే అనేక అవాంఛనీయ ఘటనలు మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఎవరూ ఈ బుల్లీయింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఏఐ సాంకేతికత ఏది, నిజం ఏది అని తెలియని విధంగా దాని అభివృద్ధి ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అలాంటి ఏఐ సాంకేతికత కారణంగా ప్రముఖ నటి రష్మికా మందన్నా ఇబ్బంది పడ్డారు. అందుకే దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్మికా మందన్నా విజ్ఞప్తి
సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టులో" నిజం సృష్టించగలిగేది అయితే విచక్షణ మన గొప్ప రక్షణగా మారుతుంది. AI అనేది అభివృద్ధికి ఒక శక్తి, అయితే దానిని దుర్వినియోగం చేయడం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం కొంతమందిలో నైతిక పతనాన్ని సూచిస్తుంది. ఇంటర్నెట్ ఇకపై నిజానికి ప్రతిబింబం కాదని గుర్తుంచుకోండి. ఇది ఏదైనా కల్పించగల ఒక కాన్వాస్." అని అభిప్రాయపడ్డారు.
అంతే కాకుండా బాధ్యతాయుతంగా ఉందామని పిలుపునిచ్చారు రష్మిక.... "దుర్వినియోగానికి అతీతంగా ఎదిగి, మరింత గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి AIని ఉపయోగిద్దాం. బాధ్యతారహితంగా ఉండటానికి బదులుగా బాధ్యతగా ఉందాం. కొందరు మానవులుగా ప్రవర్తించలేకపోతే, వారికి కఠినమైన క్షమించరాని శిక్ష విధించాలి” అని తెలిపారు.
ఏఐ బారిన పడిన వారిలో రష్మిక మొదటి స్థానంలో ఉంటారు. 2023లోనే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించారు. తనను అసభ్యంగా చిత్రీకరిస్తూ వీడియో విడుదలైనప్పుడు రష్మికా మందన్నా అప్పుడు కూడా చాలా బాధపడ్డారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత చాలా రాంగ్ వేలో వినియోగిస్తున్నారని అన్నారు. పాఠశాల, కళాశాల రోజుల్లో ఇలాంటి వీడియో విడుదలై ఉంటే ఎలా ఎదుర్కొనేదానినో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పుడు మానసికంగా ఇలాంటి వాటికి తట్టుకొని నిలబడే శక్తి వచ్చిందని అన్నారు. మరికొందరు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు తీసుకోవాలని అప్పట్లో విజ్ఞప్తి చేశారు. ఆ వీడియో తర్వాత ప్రభుత్వాలు స్పందించాయి. అప్పటి నుంచి ఇలాంటి కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం డీప్ ఫేక్, ఏఐ ద్వారా విడుదలయ్యే వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే వీడియోలను తొలగించి, తగిన చర్యలు తీసుకుంటోంది.