Rashmika Mandanna To Being Part In Raghava Lawrence Kanchana 4: హారర్, థ్రిల్లర్, కామెడీ హారర్ మూవీస్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హారర్ కామెడీ సిరీస్ హిట్ ఫ్రాంచైజీ అంటే మనకు గుర్తొచ్చేది రాఘవ లారెన్స్ 'కాంచన' మూవీ. నవ్విస్తూనే భయపెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. అప్పుడెప్పుడో వచ్చిన 'ముని' మూవీ నుంచి మొన్నటి 'కాంచన 3' వరకూ అదే హిట్ జోష్ కొనసాగింది. ఓ మంచి సందేశం ఇస్తూనే ప్రేక్షకులను నవ్విస్తూనే భయపెడతారు. ఆయన రీసెంట్‌గా 'చంద్రముఖి 2'లో కనిపించగా... ప్రస్తుతం 'కాంచన 4'తో బిజీగా ఉన్నారు.

దెయ్యం పాత్రలో...

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మరో క్రేజీ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో దెయ్యం పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాఘవ లారెన్స్ తాను హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన రోల్ కోసం నేషనల్ క్రష్‌ను రంగంలోకి దించాలని రాఘవ లారెన్స్ భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై సంప్రదింపులు పూర్తైనట్లు తమిళ మూవీ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే అటు దక్షిణాదితో పాటు ఇటు ఉత్తరాదిలోనూ అంచనాలు మరింత రెట్టింపు కానున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: బాలయ్య గొప్ప మనసు - తెలంగాణలో వరద బాధితులకు ఆర్థిక సహాయం

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక మందన్న. 'పుష్ప' నుంచి రీసెంట్‌గా వచ్చిన 'కుబేర' వరకూ ఆమె సక్సెస్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా బాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'థామా'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తన కెరీర్‌లో హారర్ కామెడీ మూవీలో కనిపించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ రోల్‌లో ఆమె కనిపిస్తారని ఫస్ట్ లుక్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ మూవీకి ఆదిత్య సర్పోత్ధార్ దర్శకత్వం వహిస్తుండగా... దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానాతో పాటు పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు నటిస్తున్నారు. ఈ దీపావళికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస ప్రాజెక్టులు

'థామా' మూవీతో పాటే 'ది గర్ల్ ఫ్రెండ్', రెయిన్ బో, మైసా చిత్రాలతో రష్మిక ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తాజాగా మరో హారర్ కామెడీ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా స్టోరీ ప్రాధాన్యం, ఉన్న పాత్రలో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల వైపు ఆమె మొగ్గు చూపుతున్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్', 'మైసా' మూవీస్ ఈ కోవకు చెందినవే. మైసా మూవీలో ఆమె ఓ యోధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తుండగా... ప్రస్తుతం షూటింగ్ సాగుతోంది.