Ranveer Singh deepfake video case: టెక్నాలజీ పెరిగేకొద్ది.. సైబర్ నేరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ మేరకు డీప్ ఫేక్ వీడియో కేసులు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న రష్మిక మందన, అలియాభట్ తదితరుల డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టించాయి. ఇప్పుడు హీరోల వంతు వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు మద్దతు ఇస్తూ హీరోలు ప్రచారం చేస్తున్నట్లుగా ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. ఈ మేరకు రణ్ వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో సృష్టించిన కేటుగాడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అసలు ఏం జరిగిందంటే?
ఓటర్లను మభ్యపెట్టేలా ఈ ఫేక్ వీడియో తయారు చేశారు. కాంగ్రెస్ ఓటు వేయాలని రణ్ వీర్ సింగ్ కోరుతున్నట్లుగా దాన్ని తయారు చేశారు. వారాణాసిలో జరిగిన ఒక కల్చరల్ ఫ్యాషన్ షోలో పాల్గొన్న రణ్ వీర్ సింగ్.. అప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో మోడీని పొగిడారు. "మన కల్చర్, హెరిటేజ్, చరిత్ర అందరికీ తెలియాలన్నదే మోడీ లక్ష్యం. దాన్ని సెలబ్రేట్ చేయడమే ఆయన ఆశయం" అని చెప్పారు. అయితే, దాన్ని సుజాత ఇండియా అనే ట్విట్టర్ యూజర్.. మార్ఫింగ్ చేశాడు. మనం ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించడం మోడీ గోల్, ఉద్దేశం. నిరుద్యోగం పెరిగిపోతున్నా, అన్యాయం జరుగుతున్నా మనం మాట్లాడకూడదు. ఓట్ ఫర్ జస్టిస్, ఓట్ ఫర్ కాంగ్రెస్" అని చెప్పినట్లుగా చేశాడు. ఈ వీడియోని నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో ఈ విషయంపై రణ్ వీర్ సింగ్ తండ్రి జతీందర్ సింగ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎఫ్ఐఆర్ నమోదు..
ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేశారు పోటీసులు. 417, 468, 469 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. ఇక ఈ మధ్యే అమీర్ ఖాన్ డీప్ ఫేక్ వీడియో కూడా వైరల్ అయ్యింది. దాంట్లో కూడా ఆయన ఒక పొలిటికల్ పార్టీకి ఓటు వేయండి అని అడిగినట్లు మార్ఫింగ్ చేశారు.
జాగ్రత్తగా ఉండాలి..
ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోయిన్ల వీడియోలు కలకలం రేపాయి. వల్గర్ వీడియోలను చేసి రిలీజ్ చేశారు చాలామంది. ఇక ఇప్పుడు ఎలక్షన్ టైం కావడంతో ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వేటిని గుడ్డిగా నమ్మొద్దని అంటున్నారు. ఓటు వేసే విషయంలో జాగ్రత్తలు వహించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని అంటున్నారు. ఇక ఈ మధ్య అల్లు అర్జున్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నట్లు వీడియోని వైరల్ చేసిన విషయం తెలిసిందే. అందుకే, ఇలాంటి వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Also Read: ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడితో హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లి - ఫోటోలు చూశారా?