Rangasthalam 2: ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు రామ్ చరణ్. కానీ ఆ సినిమా కంటే ముందు కూడా తను చేసిన పాత్రలు తనకు దేశవ్యాప్తంగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. అందులో ‘రంగస్థలం’లోని చిట్టిబాబు క్యారెక్టర్ కూడా ఒకటి. మామూలుగా ఒకప్పుడు స్టార్ హీరోలు డీ గ్లామర్ పాత్రలు చేయడం, డిఫెక్ట్ ఉన్న పాత్రల్లో కనిపించడం తరచుగా జరుగుతూ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఈ తరహా పాత్రలు చాలావరకు తగ్గిపోయాయి. మళ్లీ చాలాకాలం తర్వాత వినికిడి లోపం ఉన్న పాత్రలో రామ్ చరణ్ కనిపించి తన యాక్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే చిట్టిబాబు మరోసారి ప్రేక్షకులను పలకరిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.


హ్యాష్‌ట్యాగ్ వైరల్..


ప్రస్తుతం రామ్ చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్, సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్షన్‌లో ‘ఆర్‌సీ 16’ తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ, ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే ‘ఆర్‌సీ 16’ ఓపెనింగ్ సందర్భంగా సోషల్ మీడియా ‘రంగస్థలం 2’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా వైరల్ అవ్వడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.


ఏడేళ్ల తర్వాత..


సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అప్పటివరకు లెక్కల మాస్టర్ లాగా తన సినిమాల్లో కేవలం మ్యాథ్స్‌ను మాత్రమే చూపించే సుకుమార్.. మొదటిసారి ఆ లెక్కలను పక్కన పెట్టి ప్రేక్షకులకు ఊరమాస్ ఎంటర్‌టైన్మెంట్ అందించారు. చిట్టిబాబుగా రామ్ చరణ్‌ను ఎంత మాస్‌గా చూపించగలరో.. అంత మాస్‌గా చూపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఇక వినికిడి లోపం ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించారు చరణ్. ఇప్పటికీ ‘రంగస్థలం’ అంటే ఈ హీరో ఫ్యాన్స్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. 2018లో విడుదలయిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.


అనౌన్స్‌మెంట్ అప్పుడే..


సోషల్ మీడియాలో ‘రంగస్థలం 2’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అవ్వడంతో కచ్చితంగా సుకుమార్, రామ్ చరణ్.. మరోసారి ఈ సీక్వెల్ కోసం చేతులు కలపనున్నారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్.. అది పూర్తయిన తర్వాత ‘ఆర్‌సీ 16’ సెట్స్‌లోకి అడుగుపెడతారు. ఆ చిత్రం పూర్తి చేసుకొని ‘రంగస్థలం 2’ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ప్రస్తుతం తన అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 15న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది.


Also Read: శృతి హాసన్ తో లోకేష్ రొమాన్స్- బాబోయ్ మరీ ఇంతలా రెచ్చిపోయారేంటి?