చాలామంది సినీ సెలబ్రిటీలపై చిన్నదో, పెద్దదో ఏదో ఒక కేసు కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈమధ్య బాలీవుడ్ సినీ సెలబ్రిటీపై కేసుల లిస్ట్ ఎక్కువవుతోంది. తాజాగా బాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ హీరో రణబీర్ కపూర్‌పై కూడా ఓ కేసు నమోదయ్యింది. త్వరలోనే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఏడీ) ముందు హాజరు కావాలని రణబీర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసు ఒక గేమింగ్ యాప్ విషయంలో రణబీర్ భాగమయినందుకే అని తెలుస్తోంది. ఒక్కొక్కసారి సినీ సెలబ్రిటీలు ఏం తప్పు చేయకపోయినా.. పరోక్షంగా కొన్ని విషయాల్లో వారి జోక్యం ఉంటే చాలు.. దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం రణబీర్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది.


రెమ్యునరేషన్ విషయంలో రణబీర్‌పై కేసు..
రణబీర్ కపూర్‌పై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణమయిన యాప్.. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్. ఇది బెట్టింగ్‌లను చేసుకోవడానికి ఉపయోగించే ఒక యాప్. వేర్వేరు యూజర్ ఐడీలను క్రియేట్ చేసుకుంటూ.. చాలామంది దగ్గర డబ్బులు కాజేసి.. ఆ డబ్బంతా వేర్వేరు అకౌంట్స్‌లో పోగుచేసిన యాప్ ఇది. అయితే రణబీర్ పలుమార్లు ఈ యాప్‌కు సంబంధించిన యాడ్స్‌లో కనిపించాడు. దీనిని పలుమార్లు ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాడు. దీనికోసం రణబీర్.. భారీ మొత్తాన్నే రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు. అయితే రణబీర్ అందుకున్న ఈ రెమ్యునరేషన్ కూడా క్రైమ్‌లో భాగంగా యాప్‌కు వచ్చిందే అని నిందితులు స్వయంగా తెలిపారు.


ప్రభుత్వం కొత్త రూల్స్..
ఆన్‌లైన్ గేమింగ్ కోసం ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నింటికి ప్రభుత్వం ప్రత్యేకమైన రూల్స్‌ను ఏర్పాటు చేసింది. పందెం, బెట్టింగ్ లాంటివాటికి సంబంధించిన ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అంటూ క్లియర్‌గా చెప్పేసింది. కానీ మహేదేవ్ ఆన్‌లైన్ బుకింగ్ యాప్ మాత్రం గేమింగ్ యాప్ పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. దాదాపు డజనుమంది సెలబ్రిటీలు ఈ కేసులో భాగమయినట్టు బయటపడింది. త్వరలోనే ఈడీ.. ఈ కేసుకు సంబంధించి యాక్షన్ తీసుకుంటుందని సమాచారం. తాజాగా ఈడీ.. ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులోని ఫ్రాడ్ కేసును ఛేదించి వారి నుండి రూ.417 కోట్లను స్వాధీనం చేసుకుంది.


రోజుకు రూ.200 కోట్ల సంపాదన..
మహాదేవ్ ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌కు సంబంధించిన ఓనర్లు.. ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాల్ అనే ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఒక్క యాప్ మాత్రమే కాదు.. వారంతా కలిసి ఇలాంటి మరో నాలుగైదు యాప్స్‌ను మెయింటేయిన్ చేస్తున్నారు. ఈ యాప్స్ అన్నింటి నుండి వారు రోజుకు దాదాపు రూ.200 కోట్ల వరకు సంపాదిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ యాప్‌కు సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీ యూఏఈలో ఉంది. అంతే కాకుండా శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఈ ఫ్రాడ్ యాప్ ఏజెన్సీలు ఉన్నట్టు విచారణలో తెలిసింది. దీంతో ఇంత పెద్ద ముఠా ఉచ్చులో రణబీర్ కపూర్ కూడా చిక్కుకున్నాడని బాలీవుడ్ ఫ్యాన్స్ వాపోతున్నారు. కేవలం రణబీర్ కపూర్ మాత్రమే కాదు.. ఇంకా పలువురు సినీ సెలబ్రిటీలకు భారీ మొత్తంలో క్యాష్ ఇచ్చి ఇండియాలో ఈ యాప్‌ను ప్రమోట్ చేయిస్తున్నట్టు ఓనర్లు.. విచారణలో బయటపెట్టారు.


Also Read: ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial