సినిమా రంగంలో పోటీ ఎప్పుడూ ఉంటుంది. అయితే హీరోలు మాత్రం ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారు. ఇంకా చెప్పాలంటే మన టాలీవుడ్ హీరోల్లో కొందరు ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రామ్ చరణ్, దగ్గుబాటి రానా ఒకరు. బయట సినిమా కార్యక్రమాలలో పెద్దగా కలసి కనిపించకపోయినా.. వీరు చిన్ననాటి స్నేహితులు అని చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్‌లుగా ఎదిగినా కూడా వారి చిన్న నాటి స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. ఇటీవల రానా ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహం గురించి చెప్పుకొచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో రానాను ఇండస్ట్రీలో మీకు ఎప్పుడూ అండగా ఉండే స్నేహితుడు ఎవరు అని అడిగితే.. తనకు చాలా మంది స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని చెప్పారు రానా. తాను ఇక్కడే పెరగడం వలన చాలా మంది స్నేహితులయ్యారని చెప్పుకొచ్చారు. అయితే వారిలో రామ్ చరణ్ మొదట స్థానంలో ఉంటారని చెప్పారు. ఎందుకంటే తాను, రామ్ చరణ్ చిన్నప్పుడు కలసి ఒకే స్కూల్ లో చదువుకున్నామని చెప్పారు. తొమ్మిదో తరగతి వరకూ తాము చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ లో కలసి చదువుకున్నామని పేర్కొన్నారు. చిన్ననాటి స్నేహాన్ని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నామని తెలిపారు రానా. ఇంకో విషమేమిటంటే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అదే పాఠశాలలో చదివింది. అయితే ఆమె రామ్ చరణ్ కు జూనియర్. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి రానా, రామ్ చరణ్ ల క్లాస్ మేట్ కావడం గమనార్హం.
ఇక కెరీర్ విషయానికొస్తే.. రానా దగ్గుబాటి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘బాహుబలి’ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చకున్నారు. ప్రస్తుతం రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. వీరిద్దరూ కలసి వెబ్ సిరీస్ లలో నటించడం ఇదే మొదటిసారి. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనితో పాటు పలు సినిమాల్లో కూడా ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు రానా.
ఇక రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చకున్నారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు. ఇప్పటికే ఈ మూేవీ ఆస్కార్ అవార్డుల నామినేషన్ లలో ఎంపికైంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాట చోటుదక్కించుకుంది. మార్చి 13 న అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ టీమ్ అమెరికాకు బయలుదేరింది. ఇక ఈ వేడుక తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఆర్ సి 15’ లో భాగం కానున్నారు.