బూతులు తిట్టినది తన అక్కేనని కంచర్ల సిస్టర్స్ ముగ్గురిలో ఆఖరి అమ్మాయి రమ్య మోక్ష కంచర్ల అంగీకరించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం, వైరల్ ఆడియో క్లిప్ గురించి తెలుగు ప్రజలు చాలా మందికి తెలిసే ఉంటుంది. పికిల్స్ రేటు ఎక్కువ అని రిప్లై ఇచ్చిన కస్టమర్ మీద బూతులతో అలేఖ్య విరుచుకుపడడం తెలుగు ప్రజలు నివ్వెర పోయేలా చేసింది. ఆ వివాదంపై రమ్య మోక్ష కంచర్ల స్పందించారు.
బూతులు తిట్టింది మా అక్కే...మమ్మల్ని విమర్శించే ముందు!కస్టమర్ పట్ల బూతులతో విరుచుకుపడిన అలేఖ్యకు మద్దతుగా ఆమె చెల్లెలు రమ్య మోక్ష కంచర్ల రంగంలోకి దిగారు. మా అక్క ఆ విధంగా తిట్టలేదని ఆవిడ అబద్ధం ఏమీ చెప్పలేదు. ఆ వాయిస్ తన అక్క అలేఖ్యది అని అంగీకరించారు. అదే సమయంలో ఆ విధంగా ఎందుకు తిట్టాల్సి వచ్చిందనేది ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తమకు ప్రతిరోజు వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తాయని, అయితే కొంత మంది వాట్సాప్ సందేశాలలో బూతులు తిడతారని, అటువంటి వ్యక్తులను మ్యాగ్జిమమ్ బ్లాక్ చేస్తామని, ఫ్రస్టేషన్ తారాస్థాయికి చేరిన సమయంలో మాత్రమే ఆ విధమైన రిప్లై ఇస్తామని రమ్య మోక్ష కంచర్ల తెలిపారు. వైరల్ ఆడియో క్లిప్ విని విమర్శించే ముందు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలని రమ్య విజ్ఞప్తి చేశారు.
అమాయకుడిని తిట్టాలని కాదు...తప్పు జరిగింది... క్షమాపణలు చెప్పాం!అమాయకుడిని తిట్టడం తమ నైజం కాదని రమ్య మోక్ష కంచర్ల పేర్కొన్నారు. అతని మెసేజ్ కంటే ముందు వాట్సాప్ మెసేజ్ చేసిన మరొక వ్యక్తి బూతులు తిట్టడంతో అతడికి రిప్లై ఇవ్వబోయి కింద ఉన్న మరొకరికి బై మిస్టేక్ రిప్లై ఇచ్చినట్టు ఆవిడ తెలిపారు. అయితే జరిగిన తప్పును గ్రహించిన అలేఖ్య క్షమాపణలు కూడా చెప్పినట్లు వివరించారు. బూతులు తిడుతూ ఎవరికి అయితే ఆడియో సెండ్ చేశారో... అతడికి క్షమాపణలు చెప్పిన మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి వీడియోలో ప్రదర్శించారు.
క్షమాపణలు చెప్పే సమయానికి అతను ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అందరికీ తెలిసిందని, తమను తిడుతూ చాలామంది వీడియోలు చేశారని రమ్య మోక్ష కంచర్ల వివరించారు. తమకు అభ్యంతరకరంగా సందేశాలు పంపించిన కొందరి వాట్సాప్ చాట్ స్క్రీన్ మీద షేర్ చేశారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియా తనదేనని, ఆ ఆలోచన వచ్చిన వెంటనే తండ్రితో షేర్ చేసుకుని వ్యాపారం ప్రారంభించామని రమ్య మోక్ష కంచర్ల వివరించారు. తండ్రి చనిపోయిన తమ ముగ్గురు అక్కచెల్లెళ్లకు అండ దండగా ఎవరూ లేరని, తమ స్వశక్తితో ఈ స్థాయికి వచ్చినట్లు ఆవిడ తెలిపారు. ప్రతిరోజు తమకు వందల సంఖ్యలో తిడుతూ మెసేజ్ లు వస్తాయని, చాలావరకు బ్లాక్ చేసినా, కొన్ని సందర్భాలలో మాత్రమే ఘాటుగా రిప్లై ఇస్తామని వివరించారు.
తమను బూతులు తిట్టిన వాళ్ళను మాత్రమే తన అక్క అలేఖ్య బూతులు తిట్టిందని, ఎదుటి వ్యక్తి స్పందనను బట్టి తమ స్పందన ఉందని, రెండో ఆడియో క్లిప్ - మూడో ఆడియో క్లిప్ అంటూ లీక్స్ చేస్తున్నారని, ఆ విధంగా ఎందుకు తిట్టాల్సి వచ్చిందనేది వాళ్లు పంపిన మెసేజ్ చూస్తే అర్థమవుతుందని రమ్య మోక్ష కంచర్ల తెలిపారు. అలేఖ్యకు మద్దతుగా ఆవిడతో పాటు అక్క సుమ కూడా వీడియో విడుదల చేశారు. అయితే అలేఖ్య మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.