Actress Rambha Re Entry To Films: రంభ (Rambha).. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తన అందం, యాక్టింగ్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 1990ల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత..

రంభ సినిమాలకు దూరమై దాదాపు 15 ఏళ్లు గడిచిపోయాయి. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. తాజాగా.. ఆమె ఓ టీవీ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా లేటెస్ట్ ఇంటర్ల్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

అందుకే సినిమాలకు దూరమయ్యా..

తన పిల్లలకు ఓ వయసు వచ్చే వరకూ తల్లిగా పూర్తి బాధ్యత తీసుకున్నట్లు రంభ వెల్లడించారు. 'నా పిల్లలను దగ్గరుండి చూసుకున్నాను. మా బాబుకు ఇప్పుడు ఆరేళ్లు. కుమార్తెలకు 14, 10 ఏళ్లు. వాళ్లు ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడకుండా పనులు చేసుకుంటున్నారు. వాళ్లను చూసుకోవడం కోసమే ఇన్నాళ్లూ నేను సినిమాలకు దూరమయ్యాను. నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి నా భర్తకు తెలుసు. ఆయన ప్రోత్సాహంతోనే టీవీ షోకు న్యాయ నిర్ణేతగా వచ్చేందుకు అంగీకరించాను. ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు ఇందులో భాగం కావాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్న సమయంలో నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది.' అని తెలిపారు.

Also Read: మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!

మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై

ఫస్ట్ టైమ్ తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత భయపడ్డానో.. ఇటీవల ఓ ఈవెంట్ కోసం డ్యాన్స్ వేసినప్పుడు కూడా అంతే భయపడినట్లు రంభ వెల్లడించారు. 'వ్యాన్‌లో నుంచి కిందకు రావడానికి కూడా ఆలోచించాను. అయితే, ఒక్కసారి స్టేజ్ మీద డ్యాన్స్ చేశాక అందరి చప్పట్లు నాలో భయాన్ని పోగొట్టాయి. 30 ఏళ్ల క్రితం ఏ మ్యాజిక్ ఉంది అది రిపీట్ అయ్యింది.

ఇటీవల ఓ ప్రారంభోత్సవానికి వచ్చాను. అక్కడి ప్రజలు నాపై ఎంతో అభిమానం చూపారు. వారు నన్ను ఆదరించిన తీరు చూసిన తర్వాత నాకు మూవీస్‌పై మరోసారి ఆసక్తి కలిగింది. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన నా రక్తంలోనే ఉంది. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది నేటికీ నటిస్తునే ఉన్నారు. అందుకే నేను కూడా మరోసారి వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నా.' అని అన్నారు.

15 ఏళ్ల  వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ

రంభ తన 15 ఏళ్ల వయసులోనే మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన అందం, నటనతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 1993లో రాజేంద్రప్రసాద్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పలు, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించారు. 2010లో వివాహం జరిగిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు.