ప్రేక్షకులందు తెలుగు సినిమా ప్రేక్షకులు వేరయా అని చెప్పాలి! తెలుగు ప్రజలకు ఎవరైనా నచ్చితే వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటారు. అభిమానం చూపించడంలో తెలుగు వాళ్ళను మించిన వాళ్ళు లేరని చెప్పాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత తరంలో హీరోలకూ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానంతో తమ పిల్లలకు తారక రామారావు, చిరంజీవి, పవన్, మహేష్ ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 


యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) వీరాభిమాని ఒకరు చేసిన పని తెలిస్తే... ఆయన అంటే ప్రేక్షకులకు ఎంత అభిమానం అనేది తెలుస్తుంది.


అబ్బాయికి 'స్కంద' నామకరణం!
రామ్ అభిమాని హరిహర దంపతులకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ అబ్బాయికి 'స్కంద' అని పేరు పెట్టారు. ఆ నామకరణం కార్యక్రమానికి రామ్ అభిమానులు హాజరు అయ్యారు. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. రామ్ అంటే తనకు చాలా అభిమానం అని, తన కుమారుడికి 'స్కంద' అని పేరు పెట్టడం ద్వారా ఆ అభిమానాన్ని చూపించానని హరిహర పేర్కొన్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?






సెప్టెంబర్ 28న 'స్కంద' విడుదల
కుటుంబ విలువలతో కూడిన మాస్ కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంలో మేటి అయినటువంటి బోయపాటి శ్రీను 'స్కంద' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ సరసన శ్రీ లీల కథానాయికగా నటించారు. 


'స్కంద' చిత్రాన్ని జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. విడుదలకు ముందు ఆయన సేఫ్ జోన్‌లో ఉన్నారని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు వంద కోట్ల రూపాయలు వచ్చాయట. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతోందని తెలిసింది. ఆల్రెడీ విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేయనున్నారు.  


Also Read నా ప్రతి కన్నీటి చుక్కకూ బాధ పడ్డారు, ఫ్యాన్స్‌కు పాదాభివందనం - 'సైమా'లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్



బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial