Ram Pothneni Video Call To His Fan : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న మహిళా అభిమాని కళ్లల్లో ఆనందం నింపారు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే కలుస్తానని భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే...
తూర్పు గోదావరి జిల్లా దుప్పలపూడికి చెందిన శశి భవ్యత అనే 18 ఏళ్ల యువతి అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. జన్యు సంబంధిత వ్యాధితో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమెకు హీరో రామ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమా పాటలు విన్నా… ఫోటో చూసినా… ఆమె ముఖంలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ప్రతీ రోజూ రామ్ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ తన కూతురికి అన్నం తినిపించేది ఆ తల్లి. తాను రామ్‌తో ఒక్కసారి ఎలాగైన మాట్లాడాలని పరితపించేది.
వీడియో కాల్ చేసిన రామ్
శశి కథ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ విషయాన్ని హీరో రామ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె గురించి తెలుసుకున్న హీరో రామ్ నేరుగా ఆమెకే వీడియో కాల్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది శశి. ఆమె వైద్యానికి, మందులకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు రామ్. 'మీరెప్పుడు వస్తారు సార్?' అంటూ తన అభిమాన నటుడిని శశి అడగ్గా... 'వస్తాను. నేను రావాలంటే నువ్వు మంచిగా అన్నం తిని మందులు వేసుకుని బలంగా అవ్వాలి.
ఇక నుంచి ఫుడ్, మందులు నేనే పంపిస్తా. టైమ్‌కు తిని మందులు వేసుకుంటే బలంగా అవుతావు. అప్పుడు నువ్వు హైదరాబాద్ వస్తే మనం కలుద్దాం. నాకైతే నిన్ను త్వరగా కలవాలని ఉంది.' అంటూ ప్రేమగా మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... రామ్ మంచి మనసుపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
