Ram Gopal Varma Shares Unseen Pic With Kota Srinivasa Rao: లెజండరీ యాక్టర్, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. దాదాపు 4 దశాబ్దాలుగా సినీ కళామతల్లికి ఆయన ఎనలేని సేవలు అందించారని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 

రేర్ పిక్ షేర్ చేసిన ఆర్జీవీ

కోట శ్రీనివాసరావు మరణంపై సంచలన దర్శకుడు ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. 'నా చిత్రాలైన శివ, గాయం, మనీ, సర్కార్, రక్త చరిత్రకు మీరు చేసిన కృషి అపరిమితం సార్.' అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ రేర్ పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫోటో 1996లో అనగనగా ఒక రోజు మూవీ టైంలోనిది అని తెలిపారు. షూటింగ్ సమయంలో కోటతో ఆర్జీవీ సంభాషిస్తున్నట్లుగా ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. 

Also Read: వీరమల్లులో కోట శ్రీనివాస రావు... చివరి సినిమా ఇదే కానీ... ఎన్ని రోజులు షూటింగ్ చేశారంటే?

ఆర్జీవీ మూవీస్... కోట శ్రీనివాసరావు చాలా స్పెషల్

నాలుగు దశాబ్దాలుగా 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు ఆర్జీవీ మూవీస్‌లో చేసిన రోల్స్ చాలా స్పెషల్. అప్పటి సినిమాల్లో చేసిన రోల్స్, డైలాగ్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా 'గాయం' సినిమాలో కోట... గురు నారాయణ్‌గా అదరగొట్టారు. ఈ సినిమాలో జగపతిబాబు హీరోగా నటించగా కోట తనదైన డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు.

మూవీలో జర్నలిస్ట్‌గా రేవతి అడిగిన ప్రశ్నలకు... 'గదైతే నేను ఖండిస్తున్న' అంటూ వెరైటీ ఆన్సర్స్ ఇస్తూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కోసం వాడుతుంటారు. కోట కెరీర్‌లోనే ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర.

అల్లాదీన్... మనీ

అలాగే ఆర్జీవీ నిర్మించిన 'మనీ' సినిమాలోనూ కోట తనదైన నటనతో మెప్పించారు. అల్లాదీన్‌గా... 'భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు. భర్తగ మారకు బ్యాచిలరు.' అనే పాటతో ఓ ట్రెండ్ సృష్టించారు. దీనికి సీక్వెల్‌‌గా వచ్చిన 'మనీ మనీ'లోనూ వచ్చీ రాని ఇంగ్లీష్‌తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'రక్త చరిత్ర'లో గంభీరమైన పాత్రలో తనదైన నటనతో మెప్పించారు కోట.