Vyooham Movie Postponed Again: వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా 'వ్యూహం' సినిమా మరోసారి వాయిదా పడింది. రేపు ఫిబ్రవరి 23న విడుదల అనగా నేడు ఈ సినిమా వాయిదా పడటం గమనార్హం. తాజాగా ఐమాక్స్‌ ఈ మూవీ బుకింగ్స్‌ను తొలగించడంతో మూవీ విడుదల ఆగినట్టు తెలిసింది. కాగా నాలుగు నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా.. టీడీపీ యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కేసు వేడయంతో ఆగిపోయింది. అయితే తాజాగా మూవీ వాయిదా పడటానికి గల కారణాన్ని డైరెక్టర్‌ ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.


అయితే కొన్ని సాంకేతిక కారణాలు, మరింతగా ప్రమోషన్ కార్యక్రమాల కోసమే ఈ వ్యూహం విడుదలను నిలిపివేసినట్టు వర్మ వెల్లడించాడు. "వ్యూహం చిత్రాన్ని మార్చి 1కి, శపథం సినిమాను మార్చి 8కి వాయిదా వేశాం. కానీ ఈ సారి వ్యూహం వాయిదాకు లోకేష్ కారణం కాదు. కొన్ని సాంకేతిక కారణాలు, మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు  చేపట్టడం కోసం, మేం కోరుకున్న థియేటర్లలో విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం" వర్మ ట్వీట్ చేశాడు. 






ఈసారి లోకేష్‌ కారణం కాదని స్పష్టం చేసిన వర్మ.. ఫిబ్రవరి 23న సుమారు 9 సినిమాలు విడుదల కానున్నడంతో వ్యూహం సినిమాకు అనుకున్నన్ని థియేటర్లు దొరకకపోవడంతో వాయిదా వేసినట్టు తెలిపాడు. కాగా రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్‌, మానస ముఖ్యపాత్రలు పోషించారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో వర్మ వ్యూహం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ మరణాంతరం ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమత్రి అయ్యే వరకు తొలి ఫస్ట్‌ పార్ట్‌ ఉండనుందని ఇప్పటికే ఆర్జీవీ తెలిపాడు.


కాగా వ్యూహం సినిమాకు మొదటి నుంచి అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు సానుకూలంగా.. టీడీపీకి, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు ప్రతికూలంగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఈ మూవీపై గతంలో నారా లోకేష్‌ కేసు వేసు మూవీని నిలిపివేయాలని డిమాండ్‌ చేశాడు. నాలుగు నెలల క్రితం లోకేస్‌ కేసు కారణం వాయిదా పడిన ఈ చిత్రాన్ని వర్మ ఎట్టకేలకు విడుదల అయ్యేలా చేశాడు. ఈ క్రమంలో వ్యూహం విడుదల విషయంలో కోర్టు కేసు, సెన్సార్‌ చిక్కులతో మూవీపై అందరిలో ఆసక్తి పెంచాడు ఆర్జీవీ. ఎలాంటి అడ్డంకులు లేని ఈ సినిమా తాజాగా మారోసారి వాయిదా వేసి అందరికి షాకిచ్చాడు వర్మ.