ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్న విషయం తెల్సిందే. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్కడ అనేక షోల్లో చరణ్ పాల్గొంటున్నారు. తాజాగా రామ్ చరణ్ 'టాక్ ఈజీ' అనే ప్రముఖ టాక్ షో లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రామ్ చరణ్ ‘ఆర్ఆర్‌ఆర్’ షూటింగ్ అనుభవాలు మొదలుకుని.. తన హాలీవుడ్ ఎంట్రీ వరకు పలు విషయాలను గురించి మాట్లాడారు.
‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ సినిమా ప్రకటన ఉంటుందని కూడా ప్రకటించడం గమనార్హం. కొన్ని నెలల్లో తన హాలీవుడ్ ఎంట్రీ ప్రకటన చేయబోతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
రామ్ చరణ్ 'టాక్ ఈజీ' షో లో మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి ఏది చేసినా ప్రత్యేకమే. ఆయన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాలో తారక్ తో కలిసి నటించడం కిక్ ఇచ్చింది. ఇద్దరు హీరోలే కాకుండా పది మంది హీరోలు కలిసి ఒక సినిమాలో నటించినా కూడా ప్రతి ఒక్క హీరోకు కూడా తగిన గుర్తింపు ఇవ్వగల సమర్థుడు రాజమౌళి. ఆయన స్క్రిప్ట్ మేము ఇద్దరం కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీకరణ చాలా సరదాగా సాగింది. ఈ సినిమాలోని రామరాజు పాత్ర వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరగా ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా వర్చువల్ క్లాస్ లకు తారక్ నేను హాజరయ్యాం’’ అని తెలిపారు.
‘‘నాటు నాటు’’ కోసం చాలా కష్టపడ్డాం
‘‘నాటు పాటు’’ పాట గురించి రామ్ చరణ్ ఆ షో లో మాట్లాడుతూ.. ఈ పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించబోతున్నాం అనగానే సర్ ప్రైజ్ అయ్యాం. అక్కడ షూట్ చేయగలమని మొదట అనుకోలేదు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అధ్యక్ష భవనంలో చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం గొప్ప విషయం. ఆ పాటకు డాన్స్ చేయడానికి తారక్ నేను చాలా కష్టపడ్డాం. కొన్ని షాట్స్ కోసం టేక్ ల మీద టేక్ లు తీసుకున్నాం. ఆ సమయంలో మేము పడ్డ కష్టం కారణంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఉక్రెయిన్ లో చిత్రీకరణ చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలను దగ్గర నుంచి చూశాం. వారు చాలా మంచి వారు.. అక్కడి ఫుడ్ ను ఎంజాయ్ చేశాం. ‘‘నాటు నాటు’’ పాట చిత్రీకరణ పూర్తి అయిన మూడు నెలలకే ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలు పెట్టడం బాధకరం అన్నారు.
హాలీవుడ్ సినిమాలు ‘గ్లాడియేటర్’, ‘టర్మినేటర్’, ‘బ్రేక్ హార్ట్’ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఒక నటుడిగా నేను అన్ని దేశాల సినిమాల్లో నటించాలని కోరుకుంటాను. ప్రస్తుతానికి హాలీవుడ్ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే హాలీవుడ్ లో నా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. జులియా రాబర్ట్స్ తో కలిసి ఒక్క చిన్న సన్నివేశంలో అయినా నటించాలని కోరుకుంటున్నాను అంటూ ఆమెపై అభిమానంను రామ్ చరణ్ కనబర్చారు.