‘RRR’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే, పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మరోసారి వాయిదా
వాస్తవానికి ఈ సినిమాను ప్రకటించి చాలా కాలం అవుతున్నది. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. దర్శకుడు ఓవైపు 'ఇండియన్ 2'ను షూట్ చేస్తూనే, మరోవైపు 'గేమ్ ఛేంజర్' కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అటు నిర్మిణ సంస్థకు బడ్జెట్ కూడా తడిసిమోపెడు అవుతుందట. రీసెంట్ గా ‘ఇండియన్ 2’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చెర్రీ కూడా ప్రీగానే ఉండటంతో తాజాగా యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ, ఈ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. అయితే, షూటింగ్ వాయిదాపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ కుదరకే వాయిదా పడినట్లు వెల్లడించింది. ఈ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి కంప్లీట్ చేయనున్నట్లు తెలిపింది.
షూటింగ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదే!
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటానికి హీరో రామ్ చరణ్ అని తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన ముఖానికి చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా ముఖానికి మేకప్ వేయడంలో ఇబ్బంది కలుగుతుందట. అందుకే, డాక్టర్లు ఆయనకు ఓ 10 రోజులు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. చరణ్ గాయం తగ్గిన తర్వాత, అక్టోబర్ 6 నుంచి హైదరాబాద్‌లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
నిరుత్సాహంలో చరణ్ అభిమానులు
‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మరోసారి వాయిదా పడటంతో ఆయన అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అంతేకాదు, చరణ్ కు గాయం అయ్యిందని తెలియడంతో కంగారు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకుని షూటింగ్ కు తిరిగిరావాలని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Also: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial