Boycott SVC : "గేమ్ చేంజర్"  సినిమా నిర్మాతల్లో ఒకరైన  శిరీష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ  రామ్ చరణ్ ఫాన్స్ కి కోపం తెప్పించింది. "గేమ్ చేంజర్ " డిజాస్టర్ అవడంతో తీవ్రంగా నష్టపోయామని అసలు తమ బ్యానర్ మూసుకోవాల్సి వస్తుందేమో అన్నంతస్థాయిలో నష్టాన్ని ఎదుర్కొన్నామని శిరీష్ రెడ్డి ఇటీవల కామెంట్స్ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయిన "సంక్రాంతికి వస్తున్నాం " హిట్ కావడంతో తాము తేరుకున్నామని ఆ క్రెడిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడిదేనని అన్నారు. అంతవరకూ ఓకే గానీ "గేమ్ చేంజర్ " వల్ల అంత నష్టం వచ్చినా ఆ సినిమా హీరో రామ్ చరణ్ గానీ డైరెక్టర్ శంకర్ గానీ కనీసం తమకు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు అంటూ ఆయన అనడం రామ్ చరణ్ అభిమానులకు  ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. ఆ సినిమా మరో నిర్మాత 'దిల్ 'రాజు కూడా ఆ సినిమా నష్టం వచ్చిందని చెబుతూనే దాని కాస్త సున్నితంగానే వివరించే ప్రయత్నం చేశారు. కానీ రెండు ఇంటర్వ్యూలు సోషల్  మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ అభిమానులు హర్ట్ అయ్యారు. దానితో ఒక్కసారిగా బాయ్ కాట్ SVC  (#boycottSVC)అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దానితోపాటే ఒక లెటర్ ని కూడా  వైరల్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ కొత్త కాంట్రవర్సీగా మారింది. ఆ లెటర్లో డైరెక్ట్ గా ఎవరి పేరూ ఉద్దేశించకపోయినా అది "దిల్'" రాజు శిరీష్ ను ఉద్దేశించిన లెటర్ అని స్పష్టంగా తెలిసిపోతోంది

లెటర్ లోని అంశాలు 1. One నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయిన సమయంలో 14 రీల్స్ సంస్థ ఆ సినిమా హీరో గురించి ఒక్క మాటైనా మాట్లాడారా?

2. మైత్రీ బ్యానర్ లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఆ సంస్థ హీరోల గురించి ఎప్పుడైనా, ఎవరైనా సంభాషించారా?

3. "సైందవ్ " ఫ్లాప్ అయ్యాక ఆ సినిమా హీరో వెంకటేష్ గురించి ఆ సినిమా నిర్మాతల్లో  ఒక్కరైనా ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదు 

4." సంక్రాంతికి వస్తున్నాం " సినిమా హిట్ అయ్యాక హీరో వెంకటేష్ కి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా? లేక ఎక్స్ట్రా ఇచ్చారా?

5." దర్శకుడు శంకర్ " ఉన్నారంటూ వెళ్ళింది ఎవరు? ఒక్క సంవత్సరం అంటూ మూడు సంవత్సరాలు వృథా చేసింది ఎవరు?

6) "RRR " తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరక్టేనా?

మా అభిమానులు మూడేళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయ్యేసరికి మానసిక క్షోభతో ఉన్నారు.

మీరు మాత్రం ప్రతీ రోజూ అదే విషయమై మాట్లాడుతూ హీరో మీదా సినిమా మీదా విషం చీమ్ముతూనే ఉన్నారు. 

ప్రతీ ఇంటర్వూలో ప్రతీ ప్రెస్ మీట్‌లో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకూ కోపానికీ గురి చేస్తున్నారు.

ఇంకో సారి గేమ్ చేంజర్ సినిమా గురించి గానీ రామ్ చరణ్ గురించి గానీ తప్పు గా మాట్లాడితే  ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  

సినిమా రిలీజైన 6 నెలల తర్వాత రాజుకున్న వివాదం గేమ్‌ ఛేంజర్‌ సినిమా రిలీజ్ అయింది ఈ ఏడాది జనవరిలో. సినిమా నిర్మాణం విపరీతంగా లేట్ కావడం ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో సినిమాకు బాగా నష్టాలు వచ్చాయి అని అప్పట్లోనే బాగా ప్రచారం అయింది. ఇప్పుడు అంతా దాన్ని మర్చిపోతున్న సమయంలో అదే నిర్మాతలు కొత్త సినిమా "తమ్ముడు " రిలీజ్ కి సిద్ధమైంది. దాని ప్రమోషన్లలో భాగంగా నిర్మాతలు "దిల్" రాజు, శిరీష్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. వాటిలో రెండు ఇంటర్వ్యూల్లో వారు మాట్లాడిన మాటలు ముఖ్యంగా శిరీష్ మాట్లాడిన మాటలు  ఇప్పుడు కాంట్రవర్శి కి దారి తీశాయి. నిర్మాతలుగా వారికి వచ్చిన నష్టంపై  మాట్లాడే హక్కు వారికి 100% ఉంటుంది. అభిమానులు ప్రధానంగా ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి వారు తమ హీరోపై కామెంట్ చేయడాన్ని బాగా నెగిటివ్‌గా తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులను బట్టి అర్థమవుతోంది. అయితే ఆ పోస్టుల్లో గానీ, ట్రెండ్ అవుతున్న లెటర్ లో గాని  అధికారికంగా ఎవరి పేరు లేదు. మరి దీనిపై నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

టెన్షన్‌లో తమ్ముడు

ఇప్పుడు జరుగుతున్న ప్రచారం తమ సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని "తమ్ముడు" టెన్షన్ పడుతున్నాడు. ఈ సినిమాలో హీరో నితిన్‌కు నిజంగానే పవన్ అంటే ప్రాణం అలాంటి వీరాభిమాని సినిమా ముందు కాంట్రవర్సీ జరగడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. చాలా కాలంగా హిట్ కోసం నితిన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పుడు హిట్ అవసరం కూడా కానీ ఈ కాంట్రవర్సీ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అన్న భయం చిత్ర యూనిట్‌లో కనిపిస్తోంది.